ఎక్సలెంట్‌ రైటర్స్‌ ! అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్న ఉద్దండపిండాలు!

12 Nov, 2023 15:07 IST|Sakshi

అన్నప్రాసన నాడే ఆవకాయ తిన్న ఉద్దండపిండాలు ఉన్నారు తెలుసా? వాళ్లు ఆ సాహసం చేయడం వల్లే ఈ రోజు మనం వాళ్ల గురించి మాట్లాడుకోగలుతున్నాం. ఇక్కడ చెప్పుకోబోయే పిడుగులు పిన్న వయసులోనే చేయి తిరిగిన రచయితలకు మల్లే అద్భుతమైన పుస్తకాలను అవలీలగా రాసేశారు. పుస్తక ప్రియుల చేత ‘ఎక్సలెంట్‌’ అనిపించుకున్నారు. వాళ్లెవరంటే..

డోరతీ స్ట్రెయిట్‌ 
అమెరికన్‌  రచయిత్రి. 1958లో జన్మించిన డోరతీ.. నాలుగేళ్ల వయసులోనే ‘హౌ ద వరల్డ్‌ బిగాన్‌ ’ అనే పుస్తకం రాసి తన అమ్మమ్మకు బహుమతిగా ఇచ్చింది. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? అని తల్లి వేసిన ప్రశ్నే ఆమెలోని రచన సృజనను వెలికి తీసిందట. ప్రస్తుతం ఆమెకు 65 ఏళ్లు.

క్రిస్టఫర్‌ పాయోలీనీ
పదిహేనేళ్ల వయసులోనే హైస్కూల్‌ పూర్తి చేసిన క్రిస్టఫర్‌ తన మొదటి నవల ‘ఎరగాన్‌’ రాయడం ప్రారంభించాడు. తన పద్దెనిమిదో ఏట ఆ పుస్తకాన్ని ప్రచురించాడు. అది న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌ జాబితాలో చేరింది. ఆ సిరీస్‌లో మరో మూడు పుస్తకాలు రాశాడు క్రిస్టఫర్‌. ఆ సిరీస్‌ ప్రేరణతో  2006లో  పలు సినిమాలూ వెలువడ్డాయి.
 

ఏన్‌ ఫ్రాంక్‌
‘ది డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ గర్ల్‌’.. ప్రపంచంలో అత్యధికులు చదివిన పుస్తకాల్లో ఒకటి. రెండవ ప్రపంచయుద్ధకాలంలో.. జర్మనీకి చెందిన ఏన్‌ ఫ్రాంక్‌ అనే అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని నాజీలు బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడు ఏన్‌కు 15 ఏళ్లు. బందీగా ఉన్న సమయంలో.. తమ నరకయాతనను ఎప్పటికప్పుడు డైరీలో రాసింది. అదే ‘ది డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ గర్ల్‌’ పుస్తకంగా ప్రచురితమైంది. ఇది హిట్లర్‌ దాష్టీకాలకు.. నాటి యూదుల ఆవేదనకు సాక్ష్యంగా నిలిచింది. ఏన్‌.. తను తలదాచుకున్న బంకర్‌లోనే ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిన రెండేళ్లకు ఈ పుస్తకం ప్రపంచం ముందుకు వచ్చింది. సుమారు 60కి పైగా భాషల్లో అనువాదమైంది. 

మాటీ స్టెపనేక్‌ 
అమెరికన్‌ సుప్రసిద్ధ కవులు, వక్తల పేర్లలో మాటీ స్టెపనేక్‌ పేరు కూడా వినిపిస్తుంది. ఆ అబ్బాయి రాసిన జర్నీ త్రూ హార్ట్‌సాంగ్స్‌ అనే పుస్తకం బాగా పాపులర్‌ అయ్యింది. మస్క్యులర్‌ డిస్ట్రోఫియా బాధితుడైన మాటీ .. చిన్న వయసులోనే అనేక పాటలు, పద్యాలు, కవితలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా.  పీస్‌ అడ్వకేట్‌గానూ  వ్యవహరించాడు. అనారోగ్య సమస్యలతో 2004లో.. తన 13వ ఏట తనువుచాలించాడు.  

(చదవండి: హైటెక్‌ డాన్స్‌మ్యాట్‌! ఈజీగా నేర్చుకోవచ్చు!)

మరిన్ని వార్తలు