పదోన్నతులకు పచ్చజెండా!

5 Feb, 2019 01:55 IST|Sakshi

విద్యాశాఖలో ‘ఏకీకృత సర్వీసు’కు తొలగిన అడ్డంకి.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు

నేడు సీఎంను కలవనున్న ఎమ్మెల్సీలు.. ‘పాఠశాల’లో పదోన్నతులకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖలో పదోన్నతులు లభించే అవకాశం వచ్చింది. ఏకీకృత సర్వీసు నిబంధనల కోసం రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవన్న హైకోర్టు తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పదోన్నతులకు మార్గం సుగమం అయిందని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. దీంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎంఈవో, డిప్యూటీ ఐవోఎస్, డిప్యూటీ ఈవో, డైట్‌ లెక్చరర్‌ వంటి పోస్టుల్లో పదోన్నతులు లభించనున్నట్లు తెలిపాయి. గత 20 ఏళ్లుగా ఏకీకృత సర్వీసు నిబంధనల విష యంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్ల వివాదం కారణంగా విద్యా శాఖలో పదోన్నతులు లేకుండా పోయాయి. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పాఠశాలల పర్యవేక్షణలో ఎంఈవో, డిప్యూటీ ఈవోలే కీలకం. కానీ ఆ పోస్టుల్లో అత్యధిక శాతం ఖాళీగా ఉండటంతో పాఠశాలలను పట్టించుకునే వారు లేకుండా పోయారు. వాటితోపాటు డైట్‌ లెక్చరర్లు లేక జిల్లా ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై తీర్పు వెలువడటం, ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్లను ఏకీకృతం చేయాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాలని చెప్పడంతో సంఘాలు ఊపరి పీల్చుకున్నాయి.

ఆ తరువాత ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడటంతో పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ కేడర్‌గా ఆర్గనైజ్‌ చేస్తూ రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అవి చెల్లవని కోట్టివేసింది. దానిపై విద్యా శాఖ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ కేసులో రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో పదోన్నతులకు మార్గం సుగమం అయిందని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. దీంతో రాష్ట్రంలోని పాత మండలాల ప్రకారం ఉన్న 472 పోస్టుల్లో ఖాళీగా ఉన్న 433 ఎంఈవో పోస్టులు, కొత్తగా ఏర్పడిన 125 మండలాల్లో 125 ఎంఈవో పోస్టులను సృష్టించి పదోన్నతులు కల్పించాలని కోరుతున్నాయి. వాటితోపాటు డిప్యూటీ ఈవో, బీఎడ్‌ కాలేజీ, డైట్‌ లెక్చరర్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని పీఆర్‌టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, టీటీయూ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. 

పోస్టు                          మంజూరైనవి    పనిచేస్తున్నవి    ఖాళీలు 
ఎంఈవో                            472                 39            433 
డిప్యూటీ ఈవో                     56                 12               44 
బీఎడ్‌ కాలేజీ లెక్చరర్లు        107                30               77 
డైట్‌ లెక్చరర్లు                    206                54             152 
డైట్‌ సీనియర్‌ లెక్చరర్లు        70                  9               61  

(పాత జిల్లాల ప్రకారం పర్యవేక్షణ అధికారి, లెక్చరర్‌ పోస్టుల పరిస్థితి ఇది. పని చేస్తున్న వారిలోనూ కొందరు డిప్యుటేషన్‌పైనే ఉన్నారు.) 

నేడు సీఎంను కలవనున్న ఎమ్మెల్సీలు.. 
సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి వెంటనే పదోన్నతులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని మంగళవారం సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూల రవీందర్, కె.జనార్దన్‌రెడ్డి, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, కమలాకర్‌రావు పేర్కొన్నారు. ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, స్కూల్‌ అసిస్టెంట్లకు హెడ్‌మాస్టర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరతామని చెప్పారు. ఎంఈవో, డిప్యూటీ ఈవో పోస్టుల్లోనూ పదోన్నతులకు అవసరమైన చర్యలు చేపట్టాలని విన్నవిస్తామని వివరించారు. 

హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే..  
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవని, యథాతథ స్థితి కొనసాగాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది వెంకటరెడ్డి ధర్మాసనానికి నివేదించారు. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు