కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం

21 Jun, 2019 11:26 IST|Sakshi

సాక్షి, హైదారాబాద్‌ : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని 6వ నంబర్‌ మోటార్‌ను ఆన్‌ చేయడం ద్వారా గోదావరి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అనతి కాలంలోనే పూర్తయిన బృహత్తర బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ఈ మహోజ్వల ఘట్టానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తోపాటు ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు హాజరయ్యారు. 

కాళేశ్వరం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌
జల సంకల్ప యాగం అనంతరం ముగ్గురు సీఎంలు, గవర్నర్‌ మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లారు. ప్రాజెక్టు ఏరకంగా రూపుదిద్దుకుంది, దానికి ఏరకంగా స్వదేశి టెక్నాలజీని ఉపయోగించుకున్నారు తదితర విషయాలు ఏపీ, మహారాష్ట్ర సీఎంలకు వివరించారు. ఓ ఇంజనీర్‌ మ్యాప్‌ ద్వారా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ వారికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయాలు వివరించారు. అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్‌ నరసింహన్‌ మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.అనంతరం అతిథులతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టు బ్రిడ్జి  మీదకు వెళ్లారు. అక్కడ ముగ్గురు సీఎంలు, గవర్నర్‌ పూజలు చేశారు. 

అనంతరం ముగ్గురు సీఎంలు, గవర్నర్‌ కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 12.30గంటలకు కన్నెపల్లి పంపుహౌ‌స్‌కు చేరుకున్న కేసీఆర్‌.. అతిథులతో కలిసి అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం పంప్‌హౌస్‌ దగ్గరకు వెళ్లిన కేసీఆర్‌.. ప్రాజెక్టు విషయాలను గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌లకు వివరించారు. పంప్‌హౌస వద్ద సీఎం కేసీఆర్‌, సీఎం జగన్‌, ఏపీ, తెలంగాణ మంత్రులు కొబ్బరికాయలు కొట్టారు. మధ్యాహ్నం 12.50గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ రిబ్బన్‌ కట్‌ చేయగా, సీఎం కేసీఆర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కన్నెపల్లి పంపుహౌ‌స్‌లో ఆరో నంబరు మోటార్‌ను కేసీఆర్‌ స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు