ఉద్యోగ సంఘాలతో రేపు సీఎం భేటీ!

3 May, 2018 01:57 IST|Sakshi
సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్లపై శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఆయా సంఘాలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం ఉంటుందని, దీనికి హాజరు కావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. మొత్తం 25 డిమాండ్లు, సమస్యలను ఇదివరకే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు ప్ర భుత్వం ముందుంచాయి. ముఖ్యంగా సీపీఎస్‌ రద్దు, ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు, కొత్త పీఆర్‌సీ ఏర్పాటు, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం, ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వుల రద్దు, కొత్త జిల్లాల్లో ఉద్యోగుల శాశ్వత కేటాయింపులు జరపడం, టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌కు చర్యలు చేపట్టడం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమాన వేతనాలు చెల్లించడం, రిటైర్‌మెంట్‌ వయస్సును 60 ఏళ్లకు పెంచడం వంటి అంశాలను ప్రభుత్వం ముందుంచారు.

10 రోజుల్లో తగిన చర్యలు చేపడతామని అప్పట్లో సీఎస్‌ చెప్పార ని, నెల రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఉద్యోగ సంఘాలు భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల జేఏసీ 4న సమావేశం నిర్వహించాలని భావించింది. ఈ నేపథ్యంలో సమావేశానికి రావాలని సీఎంవో నుంచి సంఘాలకు ఆహ్వానం అందింది. దీంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ముఖ్యంగా బదిలీలు, వయోపరిమితి పెంపు, కొత్త పీఆర్‌సీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందని సంఘాలు భావిస్తున్నాయి. సీపీఎస్‌ రద్దుపైనా చర్చించి కార్యాచరణకు ఏంచేయాలన్న దానిపైనా స్పష్ట త వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 

మరిన్ని వార్తలు