మెట్రోపై ముందడుగు!

2 Jul, 2014 01:27 IST|Sakshi
మెట్రోపై ముందడుగు!

* ‘మెట్రో’ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
* ప్రత్యామ్నాయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
* ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామంటూ హామీ!
 
సాక్షి, హైదరాబాద్: ‘మెట్రో’ ప్రతిష్టంభన వీడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గం వేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం, అది సాధ్యపడదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చెబుతుండటంతో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కొంతకాలంగా నీలినీడలు కమ్ముకోవడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో, నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటుతో పాటు ఇతరత్రా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనిపై నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా తనకు నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. మెట్రో పనులపై ఆయన మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు.

ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సుల్తాన్‌బజార్, మొజంజాహీ మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఎదురయ్యే సమస్యలు, ఇతర ప్రత్యామ్నాయాలను సమగ్రంగా నివేదించాలని సీఎం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించబోదని, గడువులోగా పనులను పూర్తి చేసేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం. అలాగే ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు లీక్ చేయరాదని అధికారులను ఆయన గట్టిగా ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయమై మెట్రో నిర్మాణం చేపట్టిన ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా తాను అమెరికాలో ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అధికారుల సమావేశం విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు.
 
వివాదం పూర్వాపరాలివీ...
నగరంలో రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. చారిత్రక ప్రదేశాల్లో భూగర్భ మార్గం వేయాలన్న సూచనపై విముఖత వ్యక్తం చేస్తూ సర్కారుకు ఎల్‌అండ్‌టీ రాసిన లేఖ కలకలం సృష్టించింది. 2010లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో పేర్కొన్న పనులనే చేపడతామని, ఎల్‌అండ్‌టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పాయి.

నాటి ఒప్పందంలో భూగర్భ మెట్రో అంశం లేదని గుర్తు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హెచ్‌ఎంఆర్ అధికారులతో మంగళవారం సీఎం నేరుగా సమావేశమయ్యారు. నగర చరిత్ర, సంస్కృతులకు భంగం కలిగించని రీతిలో మెట్రో మార్గాన్ని నిర్మించాలని తాము భావిస్తున్నట్టు అధికారులతో పేర్కొన్నారు. బలవంతంగా భూగర్భ మెట్రో పనులు చేపట్టాల్సిందేనని తాము ఆదేశించడం లేదన్నారు. ప్రత్యామ్నాయాలను నిశితంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని, ఆ తర్వాతే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఎం చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా