గజ్వేల్..‘రింగ్’.. జింగ్

10 Nov, 2014 01:04 IST|Sakshi
గజ్వేల్..‘రింగ్’.. జింగ్

గజ్వేల్.. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. కానీ కేసీఆర్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారో అప్పుడే ఈ ప్రాంతానికి మంచిరోజులొచ్చేశాయి. ఇక కేసీఆర్ సీఎం అయ్యాక గజ్వేల్ దశ పూర్తిగా మారిపోయింది. అభివృద్ధి కోసం నిధుల వరద పారుతోంది. కేవలం హైదరాబాద్‌లోనే ఉన్న రింగ్ రోడ్డు ఇపుడు గజ్వేల్‌లోనూ కనిపించబోతోంది. బడ్జెట్‌లోనూ ఈ మేరకు నిధులు కేటాయించడంతో గజ్వేల్ పట్టణవాసుల ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరిపోనున్నాయి.
 
* రింగ్‌రోడ్డుకు రూ.30 కోట్లు మంజూరు చేసిన సీఎం
* మొత్తం రూ.90కోట్లతో ప్రతిపాదనలు
* భూసేకరణకు సిద్ధమవుతున్న యంత్రాంగం

గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే తొలి బడ్జెట్‌లోనే గజ్వేల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించారు. తొలిదశగా రూ.30 కోట్లు మంజూరు చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్, సీఎం అయ్యాక ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌తో దశాబ్దాలుగా పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు రింగ్‌రోడ్‌తో చెక్ పెట్టాలని భావించారు. ఈ ప్రతిపాదనను అధికారుల ముందుంచిన కేసీఆర్..సాధ్యాసాధ్యాలపై వివరాలు సేకరించారు. రింగ్‌రోడ్డు పనులకు రూ. 90 కోట్లతో అధికారులు అంచనాలు తయారు చేయగా, కేసీఆర్ తన తొలి బడ్జెట్‌లోనే మూడోవంతు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం విడుదలైన నిధులతో భూసేకరణ పనులను చేపట్టేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు.
 
నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం నుంచి ఇందిరాపార్క్, అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకించి ఇక్కడ సంత జరిగే బుధవారం ప్రధాన రహదారిపై కొంతభాగంలో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొన్నదంటే అతిశయోక్తి కాదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, ఇదే మార్గం గుండా భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతుండగా ప్రాణనష్టం సంభవిస్తోంది.

ఏప్రిల్ 9న నామినేషన్ వేయడానికి, 18న ‘మెతుకుసీమ గర్జన’ పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలో ట్రాఫిక్ సమస్యను కేసీఆర్ ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మెతుకుసీమ గర్జన సభలో ట్రాఫిక్ సమస్యను  ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌కు రింగ్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ బాధలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులను పురమాయించారు.

కేసీఆర్ ఆదేశాలను మేరకు రంగంలో దిగిన ఆర్‌అండ్‌బీ శాఖ పట్టణంలోని 133/33కేవీ సబ్‌స్టేషన్ నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్‌కళాశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు ఈ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి రూ.90 కోట్లతో అంచనాలను రూపొందించారు.

రింగ్ రోడ్డు పూర్తిచేస్తే ఈ రహదారి వెంటే భారీ వాహనాలు వెళ్లే అవకాశముండగా, ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు ని ర్మాణం గజ్వేల్ చుట్టూ 19 కిలోమీటర్ల మేర 30 మీటర్ల వెడల్పుతో నిర్మాణం కానుంది. ఇందుకోసం 140 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులను భూసేకరణకు వినియోగించనున్నట్లు ఆర్‌అండ్‌బీ ఈఈ బాల్ నర్సయ్య ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు