నోట్ల రద్దుతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ

8 Sep, 2017 01:11 IST|Sakshi

ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్‌ కుమార్‌    
సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నోట్ల రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలకూ, ఆర్థిక వ్యవస్థ అంచనాలకూ పొంతనలేదని ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్‌ కుమార్‌ అన్నారు. ‘నల్లధనం, నోట్ల రద్దు, జీఎస్టీ’అంశంపై గురువారం ఇక్కడ సీపీఎం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు ద్వారా పేదలకు మేలు జరుగుతుందన్న వాదనలో పసలేదని, అది ప్రభుత్వం చేసిన జిమ్మిక్కు మాత్రమేనని తేలిపోయిందన్నారు. నూటికి 93 శాతంగా ఉన్న అసంఘటిత రంగం ఆర్థిక లావాదేవీలు కుంటుబడ్డాయని, దాని ప్రభావం దేశ ఆర్థికాభివృద్ధిపై పడిందని తెలిపారు.

నోట్ల రద్దు ద్వారా నల్లధనం వెనక్కి రాకపోగా దానిని తెల్లధనంగా మార్చుకునే అవకాశాన్ని ధనవంతులకు కల్పించినట్లు అయిందని ఆరోపించారు. నోట్ల రద్దుతో నగదు చలామణిలో లేకపోవడం వల్ల పెట్టుబడులు తగ్గి, బ్యాంకులు రుణాలివ్వని పరిస్థితి ఏర్పడిందని, ఉత్పత్తి కుంటుపడిందని, ఫలితంగా 25 శాతం ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికే నోట్ల రద్దు అని చెప్పడంలో అర్థం లేదని అన్నారు. నల్లధనమంతా విదేశీ బ్యాంకుల్లో, స్థిరాస్తుల రూపంలో, వ్యాపారాల్లో పోగైందని, నగదు రూపేణా ఉన్నది చాలా చిన్న మొత్తమేనని అన్నారు.

మరిన్ని వార్తలు