-

సమాజం.. ఆరోగ్య

30 Sep, 2018 08:03 IST|Sakshi
బతుకమ్మ ఆడుతున్న అంగన్‌వాడీ టీచర్లు

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం అవసరమని.. ఇదే అందరి లక్ష్యం కావాలని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యాన శనివారం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంపై మేళా ఏర్పాటుచేశారు. డీడబ్ల్యూఓ జి.శంకరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్రావ్, ఐసీడీఎస్‌ రీజినల్‌ ఆర్గనైజర్‌ రాజ్యలక్ష్మి, ఫుడ్‌ కమిషనర్‌ మెంబర్‌ శారద, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ కృష్ణ, మాస్‌ మీడియా మేనేజర్‌ వేణుగోపాల్‌రెడ్డి, స్వచ్ఛ భారత్‌ జిల్లా ఇన్‌చార్జి ధృతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాతృత్వం ఎంతో గొప్పదైన మాతృత్వ మధురిమ అనుభవిస్తున్న వారు పిల్లలకు తల్లి పాటే పట్టాలని కోరారు.

తల్లి పాల విశిష్టతను అంగన్‌వాడీ టీచర్లు ప్రతీ తల్లికి వివరిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అలాకాకుండా బిడ్డలకు పోత పాలు పడితే పిల్లల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని భవిష్యత్‌ తరాలు ప్రమాదంలో పడతాయని కలెక్టర్‌ హెచ్చరించారు. పోషకాహారం ఎంత ముఖ్యమో పోషణ అభియాన్‌ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు. అనంతరం పలువురు చిన్నారులకు కలెక్టర్, జేసీ అన్నప్రాసన చేయించారు. ఇదిలా ఉండగా పోషణ్‌ అభియాన్‌లో భాగంగా కూరగాయలను, ఇతర పోషక పదార్థాలను అంగన్‌వాడీ టీచర్లు ప్రదర్శనలో ఉంచారు.

 
ఓటుహక్కుపై అవగాహన కల్పించాలి 

జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు మహిళలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ సూచించారు. 
ఈసారి అత్యాధునిక ఓటింగ్‌ యంత్రాలతో ఓటింగ్‌ జరగనుందని తెలిపారు. ఓటర్లు ఎవరూ కూడా ఓటు అమ్ముకోవద్దని వివరించడంతో పాటు ప్రతిఒక్కరు ఓటు వినియోగించుకునేలా చూడాలన్నారు. 

 ఆకట్టుకున్న నృత్యాలు 
పోషణ్‌ అభియాన్‌ మేళాలో అంగన్‌వాడీ టీచర్లు, ఎఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. టీచర్ల అందెల సవ్వడితో ఫంక్షన్‌ హాల్‌ మార్మోగింది. గిరిజన సంప్రదాయ నృత్యంతో పాటు దాండియా పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ఈఓ సుజాత, సీడీపీఓలు రాజేశ్వరి, స్వప్నప్రియ, పారిజాత, లక్ష్మి, వెంకటమ్మ, డీసీపీఓ నర్మద, సఖి కేంద్రం ఇన్‌చార్జి మంజుల, సీనియర్‌ అసిస్టెంట్‌ యాదయ్య, జూనియర్‌ అసిస్టెంట్లు శిరీష, రాజశేఖర్, వెంకటేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు