రైతుల ఇబ్బందులు తొలగిస్తాం

20 Aug, 2019 08:27 IST|Sakshi
అర్జీలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌

పార్ట్‌ బి సమస్యలను పరిష్కరిస్తున్నాం: కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ 

కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి 

ముందస్తు సమాచారం లేక స్పందన కరువు

సాక్షి, కందుకూరు: భూ సమస్యలన్నీ పరిష్కరించి రైతుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ అన్నారు. అందులో భాగంగానే ప్రతి రెవెన్యూ డివిజన్‌లో వారానికి ఓసారి ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం కందు కూరు ఆర్డీఓ కార్యాలయంలో జేసీ హరీష్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రజావాణిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. తాను ప్రతి నెలా మొదటి సోమవారం  చేవెళ్ల, రెండో సోమవారం షాద్‌నగర్, మూడో వారం కందుకూరు, నాలుగో సోమ వారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. తొలి ప్రాధాన్యం భూసమస్యల పరిష్కారానికే ఇచ్చినట్లు చెప్పారు. భూ సమస్యలు పరిష్కారమైన తర్వాత మిగతా శాఖల అధికారుల్ని కూడా ప్రజావాణిలో భాగస్వామ్ముల్ని చేస్తామని వివరించారు. ప్రస్తుతం భూప్రక్షాళనకు సంబం« దించిన పార్ట్‌ బి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా సర్వే నంబర్‌ వాస్తవ విస్తీర్ణంతో సరిపోలని సమస్యలు దాదాపు 28 వేలు ఉంటే అందులో దాదాపు 17 వేల సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. మిగతావి కూడా పరిష్కార దశలో ఉన్నాయన్నారు. 22ఏ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కడ్తాల్‌లో 361 మ్యుటేషన్లకు గాను 150 కేవైసీ పెండింగ్‌ ఉన్నాయన్నారు. మహేశ్వరంలో 2030కి 900, కందుకూరులో 1524కు 430 కేవైసీ, తలకొండపల్లిలో 293కు గాను 260 కేవైసీ పెండింగ్‌ ఉన్నాయన్నారు. గ్రామాల్లో వారానికి మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ తెలియజేశారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమన్‌గల్లు, బాలాపూర్, సరూర్‌నగర్, తలకొండపల్లి తహసీల్దార్లు యశ్వంత్, సుజాత, జానకీ, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

స్పందన కరువు 
సోమవారం కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి స్పందన కరువైంది. అధికారులు ముందస్తుగా తగినంత ప్రచారం కల్పించకపోవడంతో రైతులకు సమాచారం లేక సమస్యలను వివరించడానికి రాలేకపోయారు. డివిజన్‌ పరిధిలోని కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, సరూర్‌నగర్, బాలాపూర్‌ మండలాల నుంచి రెవెన్యూ అధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరైయ్యారు. కానీ, ఆయా మండలాల్లో కనీసం ప్రచారం చేపట్టలేదు. దీంతో గత నెలలో పెద్దఎత్తున హాజరైన ప్రజలు, ఈసారి అతి తక్కువగా వచ్చారు. కేవలం 11 అర్జీలు మాత్రమే అందినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు