మూడింటా ముసలం..

14 Nov, 2018 15:29 IST|Sakshi
నారాయణరావు తాండూరు మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్‌లో అసమ్మతి కుంపటి

టికెట్‌ దక్కలేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే రాజీనామా

వికారాబాద్‌ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసే యోచనలో చంద్రశేఖర్‌

వెంకటస్వామికి దక్కని చేవెళ్ల టికెట్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్‌లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావహులు పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. అభ్యర్థుల ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలని నిర్ణయించారు. తాండూరు టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావుకు నిరాశే మిగిలింది. కొత్తగా పార్టీలో చేరిన పైలెట్‌ రోహిత్‌రెడ్డికి టికెట్‌ కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మహారాజ్‌ కుటుంబీకులు లేదా డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డికి టికెట్‌ ఇవ్వాలని గాంధీభవన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలోనే పైలెట్‌కు టికెట్‌ రావడంతో కినుక వహించిన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. అంతే కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టంచేయడం చర్చనీయాంశంగా మారింది.  

డాక్టర్‌ సాబ్‌కు నిరాశే..
మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌కు టికెట్‌ కేటాయింపులో భంగపాటు తప్పలేదు. వికారాబాద్‌ సీటు తనకే దక్కుతుందని గంపెడాశతో ఉన్న ఆయనకు పార్టీ మొండిచేయి చూపింది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఈ స్థానం నుంచి బరిలోకి దింపడంతో చంద్రశేఖర్‌కు నిరాశే మిగిలింది. ఒకానొక దశలో వికారాబాద్‌ స్థానే చేవెళ్ల దక్కుతుందని భావించిన ఆయనకు.. అది కూడా రత్నం ఎగరేసుకుపోవడంతో రెంటికీచెడ్డ రేవడిలా తయారయ్యారు. ఈ పరిణామాలతో ఖిన్నుడైన చంద్రశేఖర్‌ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మంగళవారం సన్నిహితులతో సంప్రదింపులు జరిపిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకత్వం గులాబీ గూటికి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో గులాబీ బాస్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన చంద్రశేఖర్‌కు అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందో రాదో వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  


పడాలాకు రిక్తహస్తమే..
చేవెళ్ల టికెట్‌పై కన్నేసిన సీనియర్‌ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామికి మరోసారి రిక్తహస్తమే మిగిలింది. గత నాలుగేళ్లుగా టికెట్‌ తనకు దక్కుతుందని భరోసాతో ఉన్న ఆయనకు కొత్తగా పార్టీలో చేరిన రత్నం రూపేణా దురదృష్టం వెంటాడింది. మాజీ మంత్రి సబితను నమ్ముకున్న ఆయనకు అధిష్టానం ఆశీస్సులు దక్కలేదు. రెండు నెలల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రత్నంకు టికెట్‌ కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అనుయాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో వెంకటస్వామికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టిన సీనియర్లు.. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వెంకటస్వామి మాత్రం ఈ అంశంపై నేడో రేపో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు