పొత్తుల్లేవ్‌... సర్దుబాట్లే

24 Jul, 2019 02:23 IST|Sakshi

మున్సిపల్‌ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోరాదని కాంగ్రెస్‌ నిర్ణయం

అవసరమైతే స్థానికంగా ఇతర పార్టీలతో సర్దుబాట్లు

పరిషత్, ఎంపీ ఎన్నికల వ్యూహంతోనే ముందుకు...

లెఫ్ట్, టీజేఎస్, టీడీపీతో కూడిన కూటమికి దూరమైనట్టే!

ఎన్నికల తర్వాత మున్సిపల్‌ పీఠాల పంపకాల్లోనూ ఇదే సూత్రం

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిపోరు చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్‌ పార్టీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికటించిన మహాకూటమికి స్వస్తిచెప్పి పరిషత్, లోక్‌సభ ఎన్నికల తరహాలో పొత్తుల్లేకుండానే మున్సి‘పోల్స్‌’కు ఆ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండబోవని, కానీ అవసరమైన చోట్ల స్థానికంగా ఇతర పార్టీలతో సర్దుబాట్లు చేసుకుంటామని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ముగిశాక మున్సిపల్‌ పీఠాలు దక్కించుకునే విషయంలోనూ వీలైనంత వరకు స్వతంత్రంగానే వెళ్తామని, తప్పదనుకుంటేనే ఇతర పార్టీల సభ్యుల మద్దతు తీసుకుంటామని పేర్కొంటున్నాయి. 

ఆ పార్టీలతో దూరంగానే ఉందాం... 
మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ గత నెల నుంచే కసరత్తు ప్రారంభించింది. మున్సిపల్, జిల్లా స్థాయిల్లో పార్టీ నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించి పొత్తులపై స్థానిక నాయకత్వం నుంచి అభిప్రాయాలను సేకరించింది. మరోవైపు వామపక్షాలు, టీజేఎస్, టీడీపీలతో అధికారికంగా పొత్తులు పెట్టుకోవడం వల్ల అదనపు ఉపయోగం లేదని, దూరంగా ఉండటమే మంచిదనే నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం వచ్చింది. ఈ మేరకు క్షేత్రస్థాయి నాయకత్వానికి కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చి వార్డులవారీగా కసరత్తు చేయాలని నిర్దేశించింది.

అభ్యర్థుల ఖరారు ప్రారంభం
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లవారీగా అభ్యర్థుల ఖరారు ప్రక్రియను కాంగ్రెస్‌ ప్రారంభించింది. ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో అభ్యర్థుల ఎంపిక మార్గదర్శకాలను డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలకు అప్పగించింది. స్థానిక నాయకత్వం మున్సిపాలిటీలు, వార్డులవారీగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. పోటీకి ఉత్సాహం చూపే నేతల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన ప్రారంభించింది. ప్రతి వార్డుకు ఇద్దరు ఆశావహుల పేర్లను తుది దశ వరకు తీసుకురావాలని, వీరిలో ఒకరికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆదేశాల మేరకు సెలక్ట్‌ అండ్‌ ఎలక్ట్‌ విధానంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని టీపీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు