మరీ ఇంత పేలవమా?

28 Mar, 2017 02:42 IST|Sakshi
మరీ ఇంత పేలవమా?

బడ్జెట్‌ భేటీల్లో కాంగ్రెస్‌ తీరుపై సొంత ఎమ్మెల్యేల పెదవి విరుపు
టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టలేకపోయామని వ్యాఖ్యలు
ఇతర విపక్షాలతో సమన్వయంలోనూ వైఫల్యమే


సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం వ్యవహరించిన తీరుపై సొంత ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల హామీల అమలులో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, ధర్నాచౌక్‌ ఎత్తివేత తదితర సమస్యలెన్నో ఉన్నా వాటిని ఎత్తిచూపడంలో ప్రధాన విపక్షంగా విఫలమయ్యామని వారంటున్నారు. అధికారపక్షంపై దూకుడుగా వెళ్తామని, మిగతా విపక్షా లను సమన్వయం చేసుకుని వ్యూహాత్మకంగా వెళ్తామని ఆశిస్తే అది అడియాసే అయిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. అంతర్గత వ్యూహమంటూ లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. విపక్షాలతో సమన్వయం చేసుకోవడంలో సీఎల్పీ ఘోరంగా విఫలమైం దని కాంగ్రెస్‌ సీనియర్‌ సభ్యుడు ఒకరన్నారు. ‘‘టీఆర్‌ఎస్‌ హయాంలో ఇది నాలుగో బడ్జెట్‌.

రైతులకు రుణ మాఫీ, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, సాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగులకు ఉపాధి వంటి కీలకమైన టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలేవీ అమలుకు నోచుకోలేదు. భగీరథ, కాకతీయ వంటి పథకాల అమలులో చాలా సమస్యలున్నాయి. పైగా ప్రశ్నించే గొంతును నులిమేసేలా నిరసన హక్కునూ అణిచేస్తున్నారు. ఇందిరాపార్కు నుంచి ధర్నా చౌక్‌ను ఎత్తేశారు. ఇన్ని సమస్యలున్నా వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయాం. విపక్ష పార్టీల్లో పెద్దన్న పాత్ర పోషించలేకపోయాం. అసలు విపక్షం అసెంబ్లీలో గట్టిగా మాట్లాడు తోందన్న భావనను కూడా కల్పించలేపోయాం. మా పనితీరు సభలోనే ఇలా ఉంటే ఇక క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ఏం చెప్పగలం?’’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.

బాహుబలి, సంపత్‌ రచ్చతోనే సరి
టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి బాహుబలి వస్తాడన్న జానారెడ్డి వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. కాంగ్రెస్‌లోకి ఎవరైనా పెద్ద నాయకులు వస్తున్నారా, ఏమైనా అంతర్గత పరిణామాలు ఉన్నాయా అనే కోణంలోనూ జోరుగా ఊహాగానాలు సాగాయి. ఎస్సీ, ఎస్టీ చట్టంపై చర్చలో తాను మాట్లాడే అవకాశం లేకుండా జానారెడ్డి చేశారన్న కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ కుమార్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. ఈ ఉదంతంతో తాము మరింత పలుచనయ్యామని కాంగ్రెస్‌ సభ్యులు భావిస్తున్నారు. సభకు సంబంధంలేని ఈ రెండు అంశాలే తమ పార్టీకి సంబంధించి హైలైట్‌ కావడం పరిస్థితికి అద్దం పట్టిందని వారంటున్నారు.

మరిన్ని వార్తలు