‘అది 440 వోల్ట్‌ల కరెంట్‌.. కాంగ్రెస్‌కే షాకిస్తుంది’

29 Nov, 2023 15:58 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 135 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఉంటుందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు అనుకూలంగా "అండర్ కరెంట్" (లోలోపల అనుకూలత) ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర సింగ్ రాథోడ్ వ్యంగ్యంగా స్పందించారు. "అండర్ కరెంట్ ఉందని గెహ్లాట్ సాబ్ చెప్పింది నిజమే. అది 440 వోల్ట్‌లు. ఆయన చెబుతున్న  అండర్ కరెంట్ కాంగ్రెస్‌కే షాక్ ఇస్తుంది" అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేదని, రాష్ట్రంలో ఆ పార్టీని గద్దె దించేందుకే ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ‘కాంగ్రెస్ అవమానకరమైన పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ 135 సీట్లకు పైగా సాధిస్తుంది. ఇది అతిపెద్ద ఎన్నికల విజయాలలో ఒకటి’ అని రాథోడ్ పేర్కొన్నారు.

నవంబర్‌ 25న రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.

మరిన్ని వార్తలు