ఎస్సీలకు కార్పొరేట్‌ విద్య!

10 Mar, 2019 02:56 IST|Sakshi

బీఏఎస్‌ కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్న ప్రభుత్వం 

కొత్త జిల్లాల వారీగా ఏర్పాటుకు ప్రతిపాదనలు 

ప్రతి జిల్లా నుంచి వంద మందికి అవకాశం  

స్కూళ్ల ఎంపిక బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు 

ప్రతిపాదనలు పంపిన ఎస్సీ అభివృద్ధి శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యనందించేందుకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉండటంతో జిల్లాకు 100 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా రెసిడెన్షియల్‌ విద్యను అందిస్తోంది. తాజాగా జిల్లాల సంఖ్య పెరగడంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.  

జిల్లాను యూనిట్‌గా.. 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కావడంతో.. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అన్ని జిల్లాలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 1,000 నుంచి 3,300కు పెరగనుంది. జిల్లా స్థాయిలో బీఏఎస్‌ లబ్ధిదారుల ఎంపిక, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల ఎంపిక కూడా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడంతో పాటు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రెసిడెన్షియల్‌ విద్యను కూడా అందిస్తారు. 

ఫీజులు పెంపు...
బీఏఎస్‌ కింద ఎంపికైన వారిలో ఏడో తరగతిలోపు విద్యార్థులకు రూ. 20 వేలు, ఆపై తరగతుల వారికి రూ. 30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. నిర్వహణ భారీగా పెరగడంతో ఫీజులు పెంచాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తు త ఫీజులకు రెట్టింపు ఫీజులిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని త్వరలో ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమలు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు