చకచకా డిజిటలైజేషన్‌ 

12 Nov, 2023 05:01 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 32 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల టీవీలు, 5 లక్షల ట్యాబ్స్‌ అందుబాటులోకి.. 

డిసెంబర్‌ 21న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు పంపిణీ 

ఇక పాఠశాల విద్యలో నూరుశాతం డిజిటలైజేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థిపై చేసే ఖర్చు భవిష్యత్‌ పెట్టుబడిగా భావించి, అన్ని సదుపాయాలను అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే 30,715 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ)లు అందించగా, ఈ డిసెంబర్‌లో ఇచ్చే 32 వేల స్క్రీన్లతో కలిపి మొత్తం 63 వేలు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్‌ టీవీలు 33 వేలకు చేరడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను డిజిటలైజేషన్‌ పూర్తవుతుంది.

మరోపక్క ట్యాబ్స్‌ పంపిణీ 10 లక్షలకు పైగా చేరుకుంటుంది. దీంతో దేశంలోనే ప్రభుత్వ విద్యలో పూర్తిస్థాయి డిజిటల్‌ టెక్నాలజీని అనుసరించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవనుంది. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్‌పీలు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్‌ టీవీల అమరిక డిసెంబర్‌ 21 నాటికి పూర్తి కానుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖలోని నాడు–నేడు కమిషనరేట్‌ అధికారులు ప్రణాళికసిద్ధం చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చి డిజిటల్‌ బోధన చేపట్టారు. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్‌ టీవీ చొప్పున 10,038 స్మార్ట్‌ టీవీలను సరఫరా చేసిన విషయం తెలిసిందే. రెండో దఫాలో 32 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్‌ టీవీలను పాఠశాలలకు అందించనుంది.    

>
మరిన్ని వార్తలు