నిర్లక్ష్యానికి నిదర్శనం..! 

14 Nov, 2018 12:53 IST|Sakshi
మార్కండేయకాలనీలో మరమ్మతు చేయకుండా వదిలేసిన రోడ్డు 

అభివృద్ధి పేరిట రోడ్లను తవ్వి వదిలేసిన అధికారులు 

పునఃనిర్మించని వైనం 

ఇబ్బందుల్లో ప్రజలు 

కానరాని చర్యలు 

గోదావరిఖనిటౌన్‌: అభివృద్ధి పేరిట చేసే ఏ పని అయినా, ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినపుడే అది అభివృద్ధి అనిపించుకుంటుంది. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా చేసే పనులు ఏవైనా సబబు కాదు.  


రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీల్లో పలురకాల అభివృద్ధి పనుల కోసం కార్పొరేషన్‌ అధికారులు ఇటీవల వేసిన సీసీ రోడ్లను తవ్వారు. అయితే నెలలు గడిచినా ఇప్పటికీ మరమ్మతు చేయక పోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాగు నీరు, మరుగు దొడ్లు, రోడ్డు వెడల్పు, ఇతర పనుల కోసం తవ్విన రోడ్డును తిరిగి పునః నిర్మాణం చేయడంలో విఫలమయ్యారు. దీంతో ప్రతినిత్యం రోడ్ల వెంబడి నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

నిధుల దుర్వినియోగం.. 
అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్డును తిరిగి రెండు నెలల్లో పూర్తి చేసి యథావిధిగా ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యవంతంగా నిర్మించాలి. అయితే సంవత్సరాలు గడిచినా పునః నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతీ నిత్యం నడవడానికి, వాహనాలను తీసుకుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నామని ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులను ముందే ఆలోచించి నిర్మించకపోవడంతో కోట్ల రూపాలయతో వేసిన రోడ్డు మధ్యంతరంగా చెరిపి తిరిగి వేయడంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.  

తెగుతున్న ఇంటర్నెట్‌ తీగలు.. 
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లను తవ్వడంతో రోడ్డు క్రింద ఉన్న ఇంటర్నెట్, బీఎస్‌ఎన్‌ఎల్‌ వైర్లు తెగి నెట్‌ వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు, విద్యార్థులు, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉద్యోగాల కోసం, విద్యాపరంగా ఉండే అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నామని పేర్కొంటున్నారు.  

తాగునీటిలో మలిన పదార్థాలు..
అయితే రోడ్లను తవ్వే సమయంలో వాటి కింద ఉండే తాగు నీటి పైపులు పగిలి నీటిలో మట్టి, ఇసుక, ఇతర మలిన పదార్థాలు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

రోడ్లను బాగు చేయాలి 
స్థానికంగా వివిధ అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి. ఇంటి ఎదుట నుంచి నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది. వర్షాకాలంలో మరింత ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించాలి. 
– నరేశ్, స్థానికుడు 

కలుషితం అవుతున్న తాగునీరు
మరమ్మతుల కోసం రోడ్లను తవ్వడంతో తాగు నీటి పైపులు పగలడంతో తాగు నీరు కలుషితం అవుతోంది. దీంతో వ్యాధుల బారిన పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాగు నీరు కలుషితం కాకుండా చూడాలి.  
 – మురళి, స్థానికుడు 

మరిన్ని వార్తలు