దగాపడ్డ పత్తి రైతు

24 Oct, 2017 01:42 IST|Sakshi

నాణ్యత, తేమ శాతం పేరిట వ్యాపారుల దోపిడీ

క్వింటాల్‌కు రూ.1,000 – రూ.1,500 వరకే ధర చెల్లింపు

కడుపు మండి ఆందోళనకు దిగిన రైతులు

పెద్దపల్లిలో జాతీయ రహదారిపై రాస్తారోకో

దిగొచ్చిన వ్యాపారులు.. రూ.2 వేల కనీస ధరతో కొనుగోళ్లు

సాక్షి, పెద్దపల్లి: పత్తి రైతుకు మళ్లీ కష్టకాలం వచ్చింది. ఆరుగాలం కష్టపడి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటకు కనీస ధర రాని దుస్థితి నెలకొంది. వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. నాణ్యత, తేమ శాతం సాకుతో క్వింటాల్‌కు రూ. వెయ్యి మాత్రమే ఇస్తామంటూ నిలువు దోపిడీకి తెరతీశారు. దీంతో గుండెలు మండిన రైతులు నిరసనకు దిగారు.

పత్తి ఏరడానికైన కూలీ కూడా రావడం లేదంటూ రోడ్డెక్కారు. పత్తిని తగలబెట్టడమో.. మందు తాగి చావడమో తప్ప తమకు గత్యంతరం లేదని ఆందోళన చేశారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ దీనికి వేదికైంది. పత్తి కొనుగోళ్లు చేపట్టిన తొలిరోజే.. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ సీసీఐ చేతులెత్తేయగా, వ్యాపారులు కుమ్మక్కై దారుణంగా ధర తగ్గించడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

నిర్ఘాంతపోయిన రైతన్న
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే రైతులు తెచ్చిన పత్తిలో తేమ 12 శాతం కన్నా అధికంగా ఉందంటూ సీసీఐ అధికారులు కొనుగోలు చేయలేదు. సాంకేతిక లోపం పేరుతో ఆన్‌లైన్‌నూ పక్కన పెట్టారు. ఇదే అదనుగా వ్యాపారులు దోపిడీకి దిగారు. క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500  ఇస్తామని రైతులకు షాకిచ్చారు.

మొదటి రోజు మార్కెట్‌కు 297 మంది రైతులు పత్తి తీసుకురాగా.. 89 మంది రైతులకు సంబంధించిన పత్తికి రూ.1,000 నుంచి రూ.1,500 వరకే ధర నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దపల్లి టౌన్‌ సీఐ వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అటు వ్యాపారులు కూడా రూ.2 వేల పైన చెల్లించి పత్తి కొనుగోలుకు ముందుకువచ్చారు.

ఇదో పెద్ద కుట్ర
వాస్తవానికి పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,320. నాణ్యత లేకుంటే సాధారణంగా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు చెల్లిస్తుంటారు. కానీ సోమవారం పెద్దపల్లి మార్కెట్‌లో వ్యాపారులు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లిస్తామనడం వెనుక కుట్ర ఉందని రైతులు పేర్కొంటున్నారు.

కొంతమంది మిల్లర్లు, మార్కెట్లోని వ్యాపారులు కుమ్మక్కై కావాలనే ధరను తగ్గించేశారని.. దాంతో రైతులు మార్కెట్‌దాకా రాకుండా మిల్లర్లకే విక్రయిస్తారన్న ఉద్దేశంతో కుట్ర పన్నారని మండిపడుతున్నారు. మార్కెట్‌లో తాము ధర పెంచి కొనుగోలు చేసినా.. తర్వాత మిల్లర్లు కొనకపోతే నష్టపోతామని, అందుకే వాళ్లు చెప్పినట్లు చేస్తున్నామని ఓ వ్యాపారి బహిరంగంగానే పేర్కొనడం గమనార్హం.


ఖమ్మంలోనూ ఆందోళన
ఖమ్మం వ్యవసాయం: పత్తికి తగిన ధర కల్పించాలని, సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు, వామపక్షాల నేతలు సోమవారం ధర్నా చేశారు. తేమ నిబంధనను సడలించి పత్తి కొనుగోళ్లు చేయించాలని.. క్వింటాల్‌కు రూ.7 వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పత్తి కొనుగోళ్లలో అన్యాయం, సీసీఐ కేంద్రం ప్రారం భంపై మాట్లాడేందుకు రైతులు, నేతలు సోమవారం యార్డులోని కార్యాలయానికి వెళ్లగా సూపర్‌వైజర్లు మాత్రమే ఉండడంతో.. మార్కెట్‌ అధికారి రావాలంటూ ధర్నాకు దిగారు. మార్కెట్‌ కార్యదర్శి, సీసీఐ అధికారి యార్డుకు చేరుకుని రైతులు, నేతలతో మాట్లాడారు. రెండు రోజుల్లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

మా రక్తం తాగుతరా?
ఈ మార్కెట్‌ ఎందుకు?.. మమ్మల్ని మోసం చేయడానికా? మా రక్తం తాగడానికి పెట్టిన్రా.. క్వింటాల్‌కు వెయ్యి ఇస్తరా.. పత్తి ఏరడానికి కూలీలకైన ఖర్చు కూడా కాదు.. ఇగ మందు తాగి చావడమే దిక్కు.. – మహిళా రైతు దామ కనకవ్వ, పెద్దపల్లి జిల్లా సబ్బితం

నాణ్యత లేనందునే..
ఇటీవలి వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతిన్నది. దాంతో ధర పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొద్దిరోజులైతే మళ్లీ రైతులు అనుకున్నంత ధర వస్తుంది.. – గంట రమేశ్, ట్రేడర్, పెద్దపల్లి

మరిన్ని వార్తలు