ఓట్ల లెక్కింపులో బాధ్యతగా ఉండాలి

19 May, 2019 03:53 IST|Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బాధ్యతగా వ్యవహరించాలని కౌంటింగ్‌ ఏజెంట్లకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సికింద్రా బాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్‌ ఏజెంట్లు, కార్పొరేటర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 6.30 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్‌ల లెక్కింపుల్లో ఎలాంటి సందేహాలు వచ్చినా... అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్‌ ఏజెంట్ల బాధ్యతల గురించి చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ గుర్రం పవన్‌ కుమార్‌ గౌడ్‌ అవగాహన కల్పించారు. సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, స్టీఫెన్‌ సన్, పార్లమెంట్‌ అభ్యర్థి తలసాని సాయి కిరణ్‌ యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు