పెంపుడు తల్లి చెంతకే తన్విత..

4 Apr, 2018 19:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది. ఓ వైపు కన్నపేగు, మరోవైపు పెంచిన మమకారం... తన్విత కోసం ఇద్దరు తల్లులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. చివరకు పెంపుడు తల్లి స్వరూప దగ్గరే తన్విత ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకూ స్వరూప వద్దే తన్విత ఉండాలని కొత్త‌గూడెం 5వ అద‌న‌పు జిల్లా కోర్టు  ఆదేశాలు ఇచ్చింది. పుట్టిన రోజు నుంచి తన్విత తనవద్దనే పెరిగిందని స్వరూప కోర్టులో తన వాదనలు వినిపించింది. మరోవైపు తన్విత కన్నతల్లి ఉమ సమర్పించిన అఫిడవిట్‌ పరిశీలించిన అనంతరం కోర్టు పెంపుడు తల్లికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ప్రస్తుతం ఖమ్మం బాలల సదనం ఉన్న తన్వితను తన వెంట తీసుకు వెళ్లింది.

వివరాల్లోకి వెళితే..వివరాలివీ.. మహబుబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన మాలోతు భావు సింగ్, ఉమ దంపతులు తమ కూతురు తన్వితను రెండేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ స్వరూపలకు దత్తత ఇచ్చారు. భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీసులు ఈ కేసులో దర్యాప్తును చేపట్టి తన్విత ఖమ్మంలోని శిశు గృహంలో ఉంచారు. ఈ క్రమంలో తల్లి ఉమ తనకే అప్పగించాలని, పెంచిన తల్లి తనకే ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉండగా తన్విత మహబూబాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిందని, అక్కడే దత్తత తంతు జరిగిందని భద్రాద్రి జిల్లా పోలీసులు దర్యాప్తులో తెలపడంతో కేసును మహబూబాబాద్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పోలీసులు కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ జరిపారు. చివరకు తన్విత కన్నతల్లి ఉమకు తెలిసే దత్తత వ్యవహారం జరిగిందని, దత్తత ఒప్పంద పత్రంలో ఉన్న సంతకం కన్నతల్లి ఉమదేనని నిర్ధారించారు.

బాగా చూసుకోవడం లేదనే
భావుసింగ్ , ఉమలకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన భావు సింగ్ ఆబార్షన్ కోసం ప్రయత్నించాడు. అది తల్లికి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్నరాజేంద్రప్రసాద్ స్వరూపలకు వారి విషయం తెలిసింది. ఇందులో ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ మధ్యవర్తిత్వం వహించాడు. తన్విత జన్మించాక వారికి అప్పగించాలని ఒప్పంద పత్రం రాసుకున్నారు. దీనిపై పోలీసులు ఆర్‌ఎంపీ డాక్టర్‌తో పాటు భావు సింగ్ పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఉమ కేసు వాపసు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గుంటూరుకు చెందిన ఉన్నత కుటుంబానికి దత్తత ఇస్తున్నట్లు తనకు చెప్పారని.. కాని దత్తత తీసుకున్న వారు బాగా చూసుకోవడం లేదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఉమ వాంగ్మూలం ఇచ్చింది.

కోర్టు తీర్పు మేరకే అప్పగింత
దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు మహబూబాబాద్ కోర్టులో నివేదించారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఖమ్మం గృహంలో ఉన్న తన్వితను పెంపుడు తల్లి స్వరూపకు అప్పగించారు.

మరిన్ని వార్తలు