కోవిడ్‌ విస్తరించకుండా హెపా ఫిల్టర్లు

12 Mar, 2020 01:42 IST|Sakshi

గాంధీ, ఉస్మానియా, ఛాతీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు 

రాష్ట్రంలో మరో మూడు చోట్ల కోవిడ్‌ పరీక్ష కేంద్రాలు 

మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ విస్తరించకుండా హెపా ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో ఒక్కో ఫిల్టర్‌ ఏర్పాటుచేయనున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి ఆయా ఆస్పత్రు ల్లో చికిత్స పొందాక, ఆయా గదుల్లో వైరస్, బ్యాక్టీరియా ఉంటుంది. కిటికీలు తెరిస్తే ఆ వైరస్‌ బయటకు విస్తరించే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ సోకిన వ్యక్తి గదుల్లోని వైరస్‌ను, బ్యాక్టీరియాను ఈ హెపా ఫిల్టర్లు చంపేసి, స్వచ్ఛమైన గాలిని బయటికి పంపిస్తాయి. ఈ ఫిల్టర్లను ఏర్పాటు చేశాక ఆయా ఆస్పత్రుల చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదు. ఒక్కో ఫిల్టర్‌ను రూ.1.5 కోట్లతో కొనుగోలు చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇప్పటికే గాంధీ, ఉస్మానియాలో కోవిడ్‌ నిర్ధారణకు పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పీవర్‌ ఆస్పత్రుల్లోనూ కోవిడ్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించిందని వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ ల్యాబ్‌ల్లోనూ పరీక్షలు మొదలు అవుతాయని తెలిపారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గురువారం నుంచి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మొదలుపెడతామన్నారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని 5 ఆస్పత్రులతో పాటు పాత జిల్లా కేంద్రా ల్లోని జిల్లా ఆస్పత్రుల్లో కోవిడ్‌ సహా ఇతరత్రా వైరస్‌ల నియంత్రణకు ఐసోలేషన్, ఐసీయూ కేంద్రాలను శాశ్వత పద్ధతి లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 

రెండు సార్లు నెగెటివ్‌.. 
దుబాయ్‌ నుంచి ఇటీవల వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కోవిడ్‌ సోకడంతో ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేశామని, అతడికి ఇప్పటివరకు మరో 2 సార్లు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చిందని ఈటల తెలిపారు. దీంతో అతన్ని త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపిస్తామన్నారు. సోషల్‌ మీడియాలో బాధ్యత లేని కొందరు చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన ఎవరైనా 14 రోజుల పాటు ఇంట్లో నే ఉండాలని, ఎటూ వెళ్లొద్దని కోరారు. 

108కూ కాల్స్‌ చేయొచ్చు..
ప్రస్తుతం 104 కాల్‌ సెంటర్‌తో పాటు 108 కాల్‌ సెంటర్‌కు కూడా ఫోన్‌ చేసి కోవిడ్‌ లక్షణాలున్నవారు సాయం కోరొచ్చని మంత్రి తెలిపారు. విమానాశ్రయంలో ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేస్తున్నామన్నారు. లక్షణాలుంటే అక్కడి నుంచే  ఆస్పత్రులకు తరలిస్తామన్నారు. అన్ని దేశాల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్‌ చేస్తున్నామన్నారు. కోవిడ్‌ వైరస్‌ ఎదుర్కొనేందుకు చేస్తు న్న ఏర్పాట్లలో భాగంగా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను సీఎం నియమించారన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీదేవి ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. మరో ఐఏఎస్‌ అధికారి మాణిక్‌రాజ్‌ విమానాశ్రయం నుంచి రోజూ వచ్చే దాదాపు 5 వేల మంది ప్రయాణికులను ట్రాక్‌ చేసి 104, 108 కాల్‌ సెంటర్ల ద్వారా గుర్తించి 14 రోజుల పాటు వారందరూ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటారన్నారు.

>
మరిన్ని వార్తలు