సిలిండర్ పేలితే.. రూ.40 లక్షల బీమా

11 Aug, 2015 07:46 IST|Sakshi
సిలిండర్ పేలితే.. రూ.40 లక్షల బీమా

- వంట గ్యాస్ ప్రమాదానికి రూ.40 లక్షల బీమా!
- వినియోగదారునికి తెలియకుండా దాచిఉంచిన ఇంధన కంపెనీలు, డీలర్లు
సంగారెడ్డి టౌన్:
వంట గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే వినియోగదారునికి రూ. 40 లక్షలు బీమా కవరేజ్ ఉంది. అంతే కాకుండా సిలిండర్ పేలి బతికి బయట పడ్డ వారికి కూడా రూ. 30 లక్షల బీమా ఇవ్వాలని నిబంధన కూడా ఉంది. అయితే ఈ విషయం ఎంతమంది వంట గ్యాస్ వినియోగించే వినియోగదారులకు తెలుసనేది ప్రశ్న?  ప్రమాదాలు జరిగిన వారికి ఇంధన కంపెనీలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చిన సందర్భాలున్నాయి? ఆలోచించాల్సిందే. వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే చాలు.. సదరు వినియోగదారుడు బీమాకు అర్హుడవుతాడు. ఈ విషయం గ్యాస్ కంపెనీలలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు తెలియపోవడం విడ్డూరం.

ఉద్యోగస్తులకే తెలియంది సామాన్యులకు ఎలా తెలుస్తుంది. అంతే కాదు.. గ్యాస్ కనెక్షన్ తీసుకోవడంతోనే తమకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని వారికే తెలియదాయే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిబంధన ప్రకారం వంట గ్యాస్ వినియోగదారులందరికీ కంపెనీలు బీమా చేస్తారు. ఈ విషయం గ్యాస్ వినియోగదారులకు సంబంధిత డీలర్లు చెప్పడం లేదు. అసలు వారికి కూడా ఈ విషయం తెలుసనేది సందేహం. ఎందుకంటే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కుమ్మక్కై ఇలాంటి ముఖ్య సమాచారాన్ని బయటికి రానివ్వడం లేదు.

ఇప్పటి వరకు కొన్ని వందల గ్యాస్ సిలిండర్లు పేలిన దుర్ఘటనలు జరిగాయి. ఏ ఒక్కరికి ఈ పాలసీ ద్వారా లబ్ధిపొందిన దాఖలాలు లేవు. వంట గ్యాస్ ప్రమాదాలు జరిగిన వెంటనే వినియోగదారులు సంబంధిత డీలరుకు విషయం తెలుపాలి. ఆ డీలర్ ఈ విషయం కంపెనీకి తెలపాల్సి ఉంటుంది. విచారణ జరిపి బాధితునికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం రహస్యంగా ఉండడం శోచనీయం.  ఈ విషయంపై వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 18002333555కు ఫిర్యాదు చేయవచ్చు.

>
మరిన్ని వార్తలు