సినీ ఫక్కీలో దారి దోపిడీ

22 May, 2015 18:40 IST|Sakshi

మహబూబ్‌నగర్‌: కొల్లాపూర్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు రామాపురానికి వెళ్లే ప్రధాన రహదారిపై కాపు కాసి దారి దోపిడీ చేసిన సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే గురువారం అర్థరాత్రి 1:30గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కొల్లాపూర్ నుంచి రామాపురం వెళ్లే దారిలో ఊరాటిగుట్ట వద్ద ప్రధాన రహదారిపై చెట్టు కొమ్మలను అడ్డంగా పడవేశారు. అదే సమయంలో కొల్లాపూర్ నుంచి పెబ్బేరుకు డీసీఎంవ్యాన్ బయలుదేరింది. రోడ్డుపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు డీసీఎం డ్రైవర్ ఫయూం, క్లీనర్ రఘులు ప్రయత్నించగా పొదల మాటున కాపు కాసిన ఇద్దరు దుండగులు గొడ్డళ్లు, కత్తులతో వారిని చంపుతామంటూ బెదిరించారు. వారి జేబులో నగదు లేకపోవడంతో సెల్‌ఫోన్లు లాక్కున్నారు.


కొద్దిసేపటికి పెంట్లవెల్లికి చెందిన సుదర్శన్‌చారి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డుపై డీసీఎం వాహనం నిలిపి ఉండటం, రోడ్డుకు అడ్డంగా చెట్టు కొమ్మలు పడి ఉండటాన్ని గమనించి ఆయన అక్కడే ఆగిపోయాడు. దుండగులు ముళ్ల పొదల నుంచి అక్కడికి వచ్చి అతని జేబులోని రూ.2వేల నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొని డీసీఎంలోనే కూర్చోబెట్టారు.

45 నిమిషాల తర్వాత తిరుపతి నుంచి వస్తున్న తుఫాన్ వాహనాన్ని దుండగులు అడ్డగించారు. అందులో ప్రయాణిస్తున్న మేనుగొండ హమాలీ వెంకటస్వామి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు నగలను, రూ.3వేల నగదు, ప్రయాణికుల సెల్‌ఫోన్లను లాక్కొని వారిని పంపించారు.

కొద్దిసేపటి తర్వాత డీసీఎంలో ఉన్న సుదర్శనాచారికి తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లన్నీ అప్పగించి సోమశిల గట్లవైపు దుండగులు వెళ్లిపోయారు. సుదర్శనాచారి వెంటనే కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని దారి దోపిడీ పై ఫిర్యాదు చేశారు. అప్పటికే మేనుగొండ వెంకటస్వామి కూడా అక్కడకు చేరుకొని పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు. సీఐ రాఘవరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దుండగుల కోసం గాలించారు. దుండగుల ఆచూకీ వారికి లభించలేదు. రోడ్డుపై ఉన్నచెట్టు కొమ్మలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు