మండలానికో డెయిరీ పార్లర్‌

23 Jul, 2019 08:41 IST|Sakshi

నాగిరెడ్డిపేట: జిల్లాలోని అన్ని మండలకేంద్రాలలో విజయ డెయిరీ పార్లర్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. ఇందుకోసం జిల్లాలో ఇప్పటికే 18 మండలాల్లో పార్లర్ల నిర్వాహకుల ఎంపికను పూర్తి చేశారు. జిల్లాలోని సదాశివనగర్, గాంధారి, కామారెడ్డి, రాజంపేట మండలాల్లో ని ర్వాహకుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. రెండు, మూడురోజుల్లో నిర్వాహకుల ఎంపిక ప్రక్రియను ఐకేపీ అధికారులు పూర్తిచేయనున్నారు. ఈ నెలాఖరులోపు జిల్లాకేంద్రంలో విజయ డెయిరీ కార్యాలయంలో ఐకేపీ ఏపీఎంలతోపాటు పార్లర్ల నిర్వాహకులతో కలెక్టర్‌ సమన్వయ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

నిర్వాహకులకు ఆర్థిక చేయూత 
జిల్లాలోని ప్రతి మండలకేంద్రంలో విజయడెయిరీ పార్లర్‌ను నిర్వహించే సభ్యురాలికి ఐకేపీ అధికారులు సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక చేయూతను అందించనున్నారు. పార్లర్‌ ఏర్పాటుకు అవసరమైన ఫర్నిచర్, ఫ్రిజ్, ఫ్యాన్‌ తదితర పరికరాల కొనుగోలుతోపాటు పెట్టుబడి కోసం స్రీ నిధి, ముద్ర లోన్‌ ద్వారా నిర్వాహకులకు రుణాలు ఇప్పించనున్నారు.

14 రకాల ఉత్పత్తులు.. 
డెయిరీ పార్లర్‌లలో 14 రకాల విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించనున్నారు. విజయ డెయిరీ ఉత్పత్తి చేసే పాలు, నెయ్యి, పెరుగు, లస్సీ, దూద్‌పేడ, మిల్క్‌ షేక్, పాయసం మిక్స్‌డ్, పన్నీర్, వెన్న వంటి 14 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. 

మరిన్ని వార్తలు