ఎంజీ కారు ఇంజిన్‌లో డబ్బు తరలింపు.. పొగలు రావడంతో..

24 Nov, 2023 15:02 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు దాదాపు రూ.650 కోట్లకు పైగానే నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇక, తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

అయితే, కారు ఇంజిన్‌ డబ్బులు తరలిస్తుండగా హీట్‌ కారణంగా కరెన్సీ నోట్లు కాలిపోయి.. కారు నుంచి మంటలు, పొగ బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. ఎన్నికలవేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు  గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో(ఇంజిన్‌ వద్ద) డబ్బులను అమర్చారు. అనంతరం, వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. 

ఈ క్రమంలో, దట్టమైన పొగలు రావడంతో కారు అక్కడికక్కడే నిలిపివేసి డ్రైవర్‌ పరారయ్యాడు. అనంతరం, ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను మరో కారులో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, కారులో ఉన్న డబ్బు సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా సినీ ఫక్కిలో జరిగినట్టు క్షణాల్లో జరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కారు ఎవరది? డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టినట్టు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీసీ రవీందర్ తెలిపారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో బీఆర్‌ఎస్ హాట్రిక్‌.. తేల్చిన మరో సర్వే

మరిన్ని వార్తలు