పట్టభద్రులు ఎటువైపు..? 

17 Mar, 2019 14:33 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈనెల 22న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో ఎన్నికలకు అవసరమైన పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం పట్టభద్రులైన ఓటర్లు 16,098 మంది ఉండగా వారిలో 11,178 మంది పురుషులు, 4920 మంది మహిళా ఓటర్లున్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటర్లు జిల్లాలో 1329 మంది ఉండగా వారిలో పురుషులు 993 మంది కాగా 336 మంది మహిళలు ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల అసలైన పోరు నడుస్తోంది. జిల్లాలోని పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపనున్నారోననేది ఆసక్తి నెలకొంది. 


ప్రచార హోరు..  
జిల్లాలో యువతే లక్ష్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచార పర్వం సాగిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజా మాబాద్, మెదక్‌ జిల్లాల పరిధి పట్టభద్రుల నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో తనదైన శైలిలోప్రచారం సాగిస్తున్నారు. ఆయా జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను కలుపుకొని ప్రచార పర్వాన్ని కొనసా గిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమతమ సంఘాల నెట్‌వర్క్‌తో బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  


యువతకు గాలం..  
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రధానంగా యువతను లక్ష్యం చేసుకుని ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసుకుని మూడేళ్లు దాటిన పట్టభద్రులు ఈసారి పెద్ద ఎత్తున  ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా సుమారు 80వేల వరకు పట్టభద్రులుండగా వారిలో జిల్లానుంచి 16వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో నిరుద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రధాన పార్టీల అభ్యర్థులు జిల్లాలో నియోజకవర్గాల స్థాయిల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

యువతను లక్ష్యం చేసుకుని, పార్టీ శ్రేణుల సమీకరణతో జిల్లాకేంద్రంతో పాటు నియోజకవర్గాల స్థాయిలో మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశ్నించే గొంతుకనవుతానంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పొల్సాని సుగుణాకర్‌రావు యువతపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ పార్టీ బలాన్ని నమ్ముకుని విస్త్రృతంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రచారానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారోననే సర్వత్రా చర్చ సాగుతోంది.  

మరిన్ని వార్తలు