ఇంట్లో ఉంటేనే పేరు నమోదు

12 Aug, 2014 03:57 IST|Sakshi
ఇంట్లో ఉంటేనే పేరు నమోదు

- సమగ్ర సర్వేతో అభివృద్ధి కలెక్టర్ ప్రియదర్శిని    
- జెడ్పీలో ప్రజాప్రతినిధులకు అవగాహన సమావేశం
- అపోహలు తొలగించాలి : కాంగ్రెస్  పునర్నిర్మాణం కోసమే :  టీఆర్‌ఎస్

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ ఆర్థిక, సామాజిక సర్వే-2014పై జిల్లాకు చెందిన శాసనసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అవగాహన సమావేశం నిర్వహించారు. ఒకే వ్యక్తి అనేక చోట్ల వివరాలు నమోదు చేసుకోకుండా ఉండేందుకే ఒకే రోజులో సమగ్ర సర్వే పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. సర్వే సమయంలో అందుబాటులో ఉండే వారి వివరాలు మాత్రమే నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ఇతర ప్రాంతాల్లో చదువుతున్న వారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాల నమోదుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ప్రియదర్శిని వివరించారు. గుంపు మేస్త్రీల ద్వారా వలస కూలీల వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో తొమ్మిదిన్నర లక్షల కుటుంబాల వివరాల సేకరణకు 40వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే సర్వే నిర్వహించడం సరికాదని, వలస వెళ్లిన వివరాల నమోదుకు మరో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ శాసన సభ్యులు డీకే అరుణ, చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి సూచించారు. సర్వేపై అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టిందని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్  స్పష్టం చేశారు. సర్వే నిర్వహణపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ శర్మన్, జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు