పుర పోరుకు పటిష్ట బందోబస్తు: డీజీపీ

21 Jan, 2020 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రేపు(జనవరి 22) జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్చగా నిర్వహించేందుకు 50వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్పెషల్ పోలీస్‌తో పాటు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల పరిస్థితులను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిగా శాంతి బధ్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ వ్యవహరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను ఖచ్చితంగా పాటించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని యూనిట్ అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్, అటవీ తదితర శాఖల నుంచి కూడా బలగాలను ఎన్నికల విధులకు నియమిస్తున్నట్లు తెలిపారు. (అవసరమైతే అభ్యర్థి ఎన్నిక రద్దు చేస్తాం: ఈసీ)

పోలింగ్ సామాగ్రితో వెళ్లే ఎన్నికల సిబ్బందిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా వెళ్లేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా తగు బందోబస్తును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన 131 మంది పై కేసులను నమోదు చేసినట్లు, ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోబానికి గురి చేసేవిధంగా డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.51,36,090 లక్షల రూపాయలను స్వాదీనం చేసుకోవడంతోపాటు రూ.21,22,933 విలువైన మద్యాన్నిస్వాధీన పరుచుకున్నామన్నారు. చట్టాన్ని అతిక్రమించిన 4,969 మందిపై 1122 కేసులను నమోదు చేశామని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1745 లైసెన్స్ రివాల్వర్‌లను డిపాజిట్ చేయించడం జరిగిందని తెలిపారు. (తాగినంత మద్యం.. జేబునిండా డబ్బు)

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు జరగలేదన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా  చెక్ పోస్టుల ఏర్పాటు, వాహనాల సోదాలు, సర్వేలన్స్ టీమ్‌ల ఏర్పాటు ద్వారా పోలీసులు అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పోలింగ్ జరిగే ప్రాంతాలకు బయటి వ్యక్తులు రాకుండా చర్యలు చేపట్టినట్లు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్తూర్పిని కలిగించే విధంగా గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు