ఇక సర్టిఫికెట్ల డిజిటలైజేషన్‌

28 Oct, 2017 01:32 IST|Sakshi

టెన్త్‌ నుంచి పీహెచ్‌డీ వరకు..

రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

నకిలీల నిరోధంతోపాటు

వెరిఫికేషన్‌ సులభం

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి మొదలుకొని పీహెచ్‌డీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను డిజిటలైజ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పది నుంచి పీహెచ్‌డీ వరకు మెమోలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీలు, తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌ టీఎస్‌), టీసీఎస్‌ వంటి సంస్థల ఆధ్వర్యంలో ప్రక్రియ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 30న సంబంధిత శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది.

రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల మంది పదో తరగతి, 2.5 లక్షల మంది ఇంటర్, 5 లక్షల మంది డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర వృత్తి విద్యా కోర్సులు, మరో లక్ష మంది వరకు పోస్టు గ్రాడ్యుయేషన్, ఎం.ఫిల్, పీహెచ్‌డీ వంటి  కోర్సులు పూర్తి చేస్తున్నారు. కానీ టెన్త్, ఇంటర్‌ విద్యార్థులకు సంబంధించి ఐదారేళ్ల సమాచారమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. అయితే యూని వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సమాచారం డిజిటలైజ్‌ చేసేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టడం, ఎవరికి వారు తమకు తోచిన ఫార్మాట్‌లో సర్టిఫికెట్ల డిజిటలైజ్‌ చేయడంతో ఉపయోగం ఉండదని అధికారులు పేర్కొనడంతో ఓ నిర్ణీత ఫార్మాట్‌లో సర్టిఫికెట్ల డిజిలైజేషన్‌ చేపట్టాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. డిజిటలైజేషన్‌తో నకిలీ సర్టిఫికెట్లను పూర్తిగా నిరోధించవచ్చని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సులభమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు