సంతకం సమర్పయామీ!

25 Jan, 2016 00:53 IST|Sakshi
సంతకం సమర్పయామీ!

సంగారెడ్డి క్రైం: దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా మారింది ప్రభుత్వ కార్యాలయాల్లోని పరిస్థితి. జిల్లాలోని ఆయా శాఖల్లో డిజిటల్ కీ వ్యవహారమంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండాలి. కానీ ఆ వ్యవహారమంతా ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ శాఖల్లో సేవలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన రికార్డులను కంప్యూటరీకరించి ఆన్‌లైన్ సేవలు అందిస్తోంది. అలాగే ఉన్నతాధికారులకు సంబంధించిన సిగ్నేచర్‌ను డిజిటలైజేషన్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ఆర్జీదారుల సర్టిఫికెట్ల కోసం సంతకాలు చేయాలంటే జాప్యమవుతోంది.జాప్యాన్ని నివారించేందుకు డిజిటల్ సిగ్నేచర్ పరికరం డిజిటల్ కీని ప్రవేశపెట్టింది.

ముఖ్యంగా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే, కార్మిక శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, పోలీసు తదితర శాఖల్లో ఈ డిజిటల్ కీ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఆయా శాఖల ఉన్నతాధికారుల చేతుల్లో వుండాల్సిన డిజిటల్ కీ సిగ్నేచర్ వారికి తెలియకుండానే అనధికారికంగా దుర్వినియోగమవుతున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో డిజిటల్ కీ సిగ్నేచర్‌ను వాడుకొని ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ రూ. 3 కోట్లకు పైగా నిధులను ఆన్‌లైన్ ద్వారా దారి మళ్లించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ జరుపుతోంది.

దీనితోపాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ నేతృత్వంలో జెడ్పీ సీఈఓ వర్షిణి, జిల్లా ఎస్పీ సుమతి నేతృత్వంలో సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్నలు వేర్వేరుగా దర్యాప్తులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా వ్యవసాయ శాఖలో భారీగా నిధులు ఆన్‌లైన్ ద్వారా దారి మళ్లిన తర్వాత తీరిగ్గా అధికారులు తేరుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రతిరోజు సమావేశాలు, టెలీ కాన్ఫరెన్స్‌లు, మండలాల ప్రత్యేకాధికారుల నియామకం కారణంగా గ్రామాలను సందర్శించడం ఇలా ఆయా శాఖల అధికారులకు తీరక లేకుండాపోయింది. అంతేగాక డిజిటల్ కీని తమ వద్దే వుంచుకోవాలన్న విషయం తెలిసి కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

డిజిటల్ కీని కార్యాలయాల సిబ్బందికి, కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లోని కంప్యూటర్ ఆపరేటర్లే నియంతలుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నారు. మీ సేవా, ఇతర ఆన్‌లైన్ సేవల ద్వారా ఇస్తున్న సర్టిఫికెట్లు చాలా వరకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు సంబంధం లేకుండానే జారీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికైనా ప్రభుత్వ ప్రధాన శాఖల్లో డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటే ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా అడ్డుకట్ట వేయడానికి అవకాశం వుంటుంది. డిజిటల్ సిగ్నేచర్ ఎందుకు వాడారు? ఏ ఏ సర్టిఫికెట్లకు వాడారో? పేర్కొంటూ రికార్డులు నమోదు చేస్తూ, వాటిని ప్రతి వారం జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

మరిన్ని వార్తలు