సిగ్నేచర్‌ గ్లోబల్‌ @ రూ. 366–385

15 Sep, 2023 01:25 IST|Sakshi

ఈ నెల 20–22 మధ్య పబ్లిక్‌ ఇష్యూ

ముంబై: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్‌ గ్లోబల్‌(ఇండియా) లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 366–385 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఐపీవో ఈ నెల 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 603 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 127 కోట్ల విలువైన షేర్లను సైతం విక్రయానికి ఉంచనుంది. వెరసి రూ. 730 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 330 కోట్లు సమకూర్చుకునే లక్ష్యంతో ఉంది.

కంపెనీ గతేడాది జులైలో సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 432 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు కంపెనీ చైర్మన్‌ ప్రదీప్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. గతేడాది చివరికల్లా రూ. 1,100 కోట్ల నికర రుణ భారం నమోదైనట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను ఇతర సంస్థలు, భూముల కొనుగోళ్లకు కేటాయించనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 78.35 శాతం వాటా ఉంది. ఐఎఫ్‌సీ 5.38 శాతం వాటాను కలిగి ఉంది. అనుబంధ సంస్థ సిగ్నేచర్‌ బిల్డర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ద్వారా గురుగ్రామ్‌లోని సోలెరా ప్రాజెక్టుతో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు