‘ఆయనేం మాట్లాడారో నాకు తెలియదు’

1 Jun, 2017 14:49 IST|Sakshi
‘ఆయనేం మాట్లాడారో నాకు తెలియదు’

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. అధికారుల అండతోనే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని.. ఈ అంశంతో సంబంధం ఉన్న సబ్‌ రిజిస్టార్‌లను బదిలీ చేశారు తప్పా వారి వెనుక ఉన్న ముఖ్య నాయకులను వదిలేశారని ఆరోపించారు.

గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం తమకు నమ్మకం లేదని, మియాపూర్‌ భూ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. భూ కబ్జా వ్యవహారంలో పెద్ద పెద్ద వాళ్ల హస్తముందని, కాంగ్రెస్‌ హయం నుంచి విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదన్నారు. నయీం కేసులో కూడా పోలీసుల మీద చర్యలు తీసుకొని నాయకులను వదిలేశారని అన్నారు. ఈ కేసులో అలా చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు మీడియా హైప్ ఇచ్చిందన్నారు. చాలా మంది చేరతారని ప్రచారం జరిగినా ఎవరు చేరలేదని తెలిపారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పొత్తులపై జైపాల్‌రెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదని దిగ్విజయ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు