28న ఆర్డీఎస్ పై కర్ణాటకతో చర్చలు

24 Apr, 2016 04:25 IST|Sakshi
28న ఆర్డీఎస్ పై కర్ణాటకతో చర్చలు

బెంగళూరు వెళ్లనున్న మంత్రి హరీశ్‌రావు

 సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)పై నెలకొన్న అనిశ్చితికి తెరదించేం దుకు ఎగువ రాష్ట్రమైన కర్ణాటకతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డీఎస్‌పై చర్చించేందుకు ఈ నెల 28న బెంగళూరుకు రావాల్సిందిగా కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎం.బి. పాటిల్...రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును శనివారం ఆహ్వానించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నడుమ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న ఆర్డీఎస్ వివిధ కారణాలతో తెలంగాణ ప్రాంత ఆయకట్టు రైతులకు నీరు అందించలేకపోతున్న వైనాన్ని హరీశ్‌రావు శనివారం ఫోన్లో పాటిల్‌తో చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డీఎస్ పనులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.

కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా 5-6 టీఎంసీలకు మించి రావడం లేదని...ఫలితంగా నిర్దేశిత ఆయకట్టులో కనీసం 20 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రైతులు తరచూ తూములు పగలగొట్టడం, నీటిని అక్రమంగా తరలించుకుపోవడం వంటి చర్యలతో ఆర్డీఎస్ ద్వారా తెలంగాణలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్నారు.

ఆర్డీఎస్ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తును 15 సెంటీమీటర్ల మేర పెంచేందుకు, లైనింగ్ మరమ్మతులకు ఉమ్మడి రాష్టంలో రూ. 72 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు. ఇందులో రూ. 58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినా పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆర్డీఎస్‌పై నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పాటిల్‌కు సూచించారు. దీనిపై స్పందించిన పాటిల్.. ఈ నెల 28న హరీశ్‌రావును బెంగళూరుకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు