కాంగ్రెస్‌వి దొంగ డిక్లరేషన్లు

22 Sep, 2023 03:11 IST|Sakshi
లబ్ధిదారులకు ఇంటి పత్రాన్ని అందజేస్తున్న హరీశ్‌రావు. చిత్రంలో దానం, మహిపాల్‌రెడ్డి

నమ్మితే మోసపోవడమే: మంత్రి హరీశ్‌రావు 

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 4,800 మందికి ఇళ్ల పంపిణీ 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్‌షిప్‌లో జీహెచ్‌ఎంసీ నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడు తూ కేసీఆర్‌ కిట్టు.. న్యూట్రీషియన్‌ కిట్టు.. ఎన్‌సీడీ కిట్టు.. ఇలా బీఆర్‌ఎస్‌ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్‌ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్‌ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్‌ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు.

ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు..
కాంగ్రెస్‌ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు