ఈ పోరాటం ఇక్కడితో ఆగదు: డీకే అరుణ

13 Dec, 2019 16:46 IST|Sakshi

దీక్ష విరమించిన డీకే అరుణ

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ ఇందిరాపార్క్‌లో చేపట్టిన దీక్ష నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి పరిపూర్ణానంద స్వామి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం కోసం ఆమె రెండురోజుల మహిళా సంకల్ప దీక్ష చేపట్టారు. శుక్రవారం దీక్ష ముగింపు సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పోరాటం ఇక్కడితో ఆగదన్నారు. ఈ పోరాటాన్ని ప్రతీ జిల్లాకు తీసుకెళ్తామని, బెల్ట్‌షాపులను మూసివేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో గుడి, బడి తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించారు.

తాగిన మైకంలోనే నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దిశ సంఘటన ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరంలో 30 వేల మంది తాగి రోడ్లపై పడిపోతున్నారని, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో మద్యం నిషేధం వైపు అడుగులు పడుతున్నాయని ప్రస్తావించారు. చిత్తశుద్ధి ఉంటే మద్య నిషేధం కష్టసాధ్యమైన పనేంకాదని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు