పార్ట్‌టైం లెక్చరర్ల గౌరవ వేతనం రెట్టింపు

30 Jan, 2019 03:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీల్లో పార్ట్‌ టైం లెక్చరర్లుగా, గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్న లెక్చరర్ల వేతనాలు రెట్టింపు కానున్నాయి. ఏడో వేతన కమిషన్‌ సిఫారసుల మేరకు ఇటీవల అధ్యాపకుల వేతనాలను పెంచిన ప్రభుత్వం, గెస్ట్‌ ఫ్యాకల్టీ వేతనాలను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి గౌరవ వేతనాన్ని పెంచుతూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లకు యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్‌ రజనీష్‌ జైన్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. తాజా పెంపు ప్రకారం గెస్ట్‌ ఫ్యాకల్టీకి ఒక్కో పీరియడ్‌కు (లెక్చర్‌) రూ.1,500 చెల్లించాలని, లేదా నెలకు రూ.50 వేల వరకు చెల్లించవచ్చని పేర్కొంది.

ప్రస్తుతం మన రాష్ట్రంలోని వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం/గెస్ట్‌ ఫ్యాకల్టీకి నెట్‌/సెట్‌/పీహెచ్‌డీ ఉన్న వారికైతే ఒక పీరియడ్‌కు రూ.700, ఆ అర్హతలు లేనివారికి రూ.600 చొప్పున వర్సిటీలు చెల్లిస్తున్నాయి. తాజా పెంపుతో నిర్ధేశిత అర్హతలున్న ఫ్యాకల్టీకి ఇకపై ఒక్కో పీరియడ్‌కు రూ.1,500 వేతనం లభించనుంది. వర్సిటీల్లో ఖాళీల మేరకు గెస్ట్‌ ఫ్యాకల్టీల నియామకానికి ఆమోదం తెలిపింది. రెగ్యులర్‌ పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకునే అర్హతలనే ఈ నియామకాల్లోనూ పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. వైస్‌ ఛాన్స్‌లర్‌ చైర్‌పర్సన్‌గా ఈ నియామకాలకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, డీన్, హెచ్‌వోడీ, సబ్జెక్టు నిపుణులతోపాటు ఎస్సీ/ఎస్టీ/ బీసీ/ మైనారిటీ/ వికలాంగుల కేటగిరీలకు చెందిన అకడమిషియన్‌ ఉండాలని వివరించింది. గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు గరిష్ట వయస్సు 70 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు