మద్యం మత్తులో సీఐ హల్‌చల్‌

23 Feb, 2018 19:07 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసేది పోలీసులు.. మరి అదే పోలీసు అధికారే ఆ పరీక్షలో పట్టుబడితే.. కామారెడ్డి జిల్లాలో ఇదే జరిగింది..  నిజామాబాద్‌, కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే మార్గంలో  సదాశివ నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి మద్యం సేవించి కారు నడిపిన దర్పల్లి సీఐ ధరావత్‌ కృష్ణ ఒక ట్రాక్టర్‌ను ఢీకొని, తిట్టి మరీ వెళ్ళిపోయాడు.   

స్థానికులు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం  అందించారు. హైదరాబాద్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సదాశివనగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కారును పట్టుకున్నారు. అందులో ఉన్నది దర్పల్లి సీఐ ధరావత్‌ కృష్ణ అని తెలియగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాలతో డ్రంకన్‌ డ్రైవ్ పరీక్షలు చేసి కేసు నమోదు చేశారు. సదరు సీఐపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా  నిజామాబాద్ సీపీ కార్తికేయ విచారణ జరిపారు.

నివేదికను పై అధికారులకు పంపి వెంటనే సీఐ బదిలీ వేటు వేశారు. దర్పల్లి నుంచి నిజామాబాద్  ఎర్‌హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మద్యం మత్తులో వీరంగం సృష్టించింది ఒక సీఐ అని తెలియడంతో ఈ సంఘటన ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. బదిలీ వేటు చర్యలు తీసుకోవడంతో పోలీసు శాఖ తీరుపై ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు