మూడుముళ్ల బంధంతో ఏకమైన మూగ ప్రేమికులు

16 Nov, 2017 08:34 IST|Sakshi

బెల్లంపల్లి: మూగ ప్రేమికులు మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. ఒకేచోట కలిసి చదువుకుని, మధ్యలో వచ్చిన ఎడబాటులో స్నేహాన్ని కొనసాగించి, చివరకు తల్లిదండ్రులను ఒప్పించి ఆ ప్రేమికులు పెళ్లి పీటలెక్కారు. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య ఆనందోత్సహాలతో పెళ్లి చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన బైరి సునీత–సత్యనారాయణ దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె సౌజన్య, కుమారులు ప్రణీత్, ప్రశాంత్‌. కొడుకులు ఇద్దరు పుట్టుకతోనే నోటిమాటలు రాకుండా, చెవుడుతో జన్మించారు.

 వరంగల్‌ జిల్లా పెద్ద పెండ్యాలలో ఉన్న లిటిల్‌ ఫ్లవర్స్‌ డెఫ్‌ అండ్‌ డెమ్‌ పాఠశాలలో ప్రణీత్‌ను చేర్పించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రణీత్‌ అదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కోల కృష్ణకుమారి–వెంకటేశ్వర్లు దంపతులకు కుమార్తె మ«ధులత, కుమారుడు సుధీర్‌ ఉన్నారు. మధులత కూడా నోటిమాటలు రాకుండా, వినికిడి సమస్యతో జన్మించింది. ఆమెను కూడా తల్లిద్రండులు పెద్ద పెండ్యాలలోని లిటిల్‌ ఫ్లవర్స్‌ డెఫ్‌ అండ్‌ డెమ్‌ పాఠశాలలో చేర్పించారు. ప్రణీత్, మధులత ఒకే పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఐదేళ్లు కలిసి చదువుకోవడంతో వీరిమధ్య స్నేహం ఏర్పడింది. 

దూరమై... దగ్గరయ్యారు..
పెద్ద పెండ్యాలలో పదో తరగతి పూర్తికాగానే మధులత విజయవాడలో ఇంటర్మీడియెట్‌ చదివి, డిగ్రీ మధ్యంతరంగా మానేసింది. ప్రణీత్‌ పై చదువులకు వెళ్లలేకపోయాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. సైగలు తప్ప మాట్లాడలేని మధులత, ప్రణీత్‌ సెల్‌ చాటింగ్‌లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. క్రమంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకే పాఠశాలలో చదివిన బ«ధిరులు తరచుగా ఏదో ఓ చోట అందరూ కలుసుకునేవారు. ఒకరితో ఒకరు అనుబంధాలను పంచుకుని ఆత్మీయతలను కనబర్చేవారు. ఆరు నెలల క్రితం మధులత ప్రేమ విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పి, ప్రణీత్‌ తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడాలని కోరింది. ఆమె కోరిక మేరకు మధులత తల్లిదండ్రులు వెంటనే ప్రణీత్‌ తల్లిదండ్రులను సంప్రదించారు. దీంతో వారు కూడా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. 

కట్నకానుకలు లేకుండా పెళ్లి..
మ«ధులత, ప్రణీత్‌ కులాలు వేర్వేరు. అయినప్పటికీ ఇరు కుటుంబాల పెద్దలు కట్నకానుకలు లేకుండా పెళ్లి చేయడానికి అంగీకరించారు. ప్రణీత్‌ తండ్రి సింగరేణిలో కార్మికుడు. మధులత తండ్రి కూరగాయల వ్యాపారి. మధులత, ప్రణీత్‌ల పెళ్లికి బధిరులైన వారి స్నేహితులు 50 మందికి పైగా హాజరు కాగా.. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశీర్వాదంతో ఇద్దరూ ఏకమయ్యారు.  

మరిన్ని వార్తలు