మెత్తబడిన సర్కారు?

16 Nov, 2017 08:37 IST|Sakshi

సీఎల్పీలో వైద్య నియంత్రణ బిల్లుపై చర్చే లేదు

ఆరోగ్యమంత్రితో తానే మాట్లాడతానన్న సీఎం!

సాక్షి, బెంగళూరు (బెళగావి): ప్రైవేటు ఆస్పత్రుల నియంత్రణకు సంబంధించి రూపొందించిన కర్ణాటక ప్రైవేట్‌ మెడికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ (కేపీఎంఈ)పై సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కు తగ్గిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎల్పీ సమావేశంలో కేపీఎంఈ పై అసలు చర్చ జరగకపోవడంతో ప్రైవేటు లాబీయింగ్‌కి ప్రభుత్వం తలొగ్గిందా అన్న అనుమానాలు ముసురుకొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... బుధవారం ఉదయం బెళగావి సువర్ణసౌధలో సీఎల్పీ సమావేశం ప్రారంభం కాగానే సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్‌ సహచరులతో ‘ఈ బిల్లుకు సంబంధించి మీరెవరూ చర్చించాల్సిన అవసరం లేదు. నేను ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాను’ అని పేర్కొన్నట్లు సమాచారం.

దీంతో ఆరోగ్యశాఖ మంత్రి రమేష్‌కుమార్‌ నిరాశకు లోనయ్యారు. ఏదిఏమైనా ఈ బిల్లును చట్టం చేస్తామని చెప్పే మంత్రి రమేష్‌కుమార్, సీఎల్పీ సమావేశం అనంతరం తనను కలిసిన విలేకరులతో మాత్రం ....‘మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే మా సీఎల్పీ నాయకుడిని అడగండి. ఈ విషయం పై నేను ఏమీ మాట్లాడలేను’ అని సమాధానమిచ్చారు. దీనిని బట్టి ముసాయిదాపై సిద్ధు మెత్తబడినట్లు అంచనా. ప్రైవేటు వైద్యుల తీవ్ర నిరసనలు, వైద్యమందక అక్కడక్కడ జనం మరణాలే పునరాలోచనకు పురికొల్పి ఉంటాయని భావిస్తున్నారు.

మంత్రి ఆంజనేయపై ‘కమీషన్ల’ విమర్శలు
సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయపై స్వపక్ష ఎమ్మెల్యేలే విమర్శలతో మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎం.టి.బి.నాగరాజు తో పాటు ఇతర ఎమ్మెల్యేలు ‘మంత్రి ఆంజనేయ నుండి సంక్షేమ పథకాల నిధులను ఎమ్మెల్యేలు పొందాలన్నా కమీషన్‌లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. మంత్రి ఆంజనేయ ఏజెంట్‌లను నియమించుకొని కమీషన్‌లు వసూలు చేస్తున్నారు’ అని సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని గమనించిన సీఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యేలను శాంతపరిచిన అనంతరం, ఈ లోపాలన్నింటిని సరిచేయాలని మంత్రి ఆంజనేయకు సూచించారు. కాగా, ఎమ్మెల్యేలందరూ సభలకు తప్పనిసరిగా హాజరు కావాలని సిద్ధు ఆదేశించారు.

మరిన్ని వార్తలు