మోఠారెత్తిస్తున్న మాంద్యం..

11 Sep, 2019 02:27 IST|Sakshi

5నెలల్లో 420కోట్లు హుష్‌కాకి

వాహన విక్రయాలు తగ్గడంతో ఖజానాపై ప్రభావం

భారీగా తగ్గిన వాహన పన్ను రాబడి

త్రైమాసిక పన్ను మినహా అన్నింటా గండి

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వేయి కోట్లు తగ్గే అవకాశం

మాంద్యం, జీఎస్టీ తదితర అంశాలే కారణం 

సాక్షి, హైదరాబాద్‌:  ‘ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపు తున్న ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి రావడానికి చింతిస్తున్నాను’ – ఇవీ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంలో సీఎం కేసీఆర్‌ అన్న మాటలు. మాంద్యంతో పాటు జీఎస్టీ, వర్షాలతో కలిగిన నష్టం వంటి కారణాలతో కొను గోలుదారులు బెంబేలెత్తారు. ఫలితంగా వాహన విక్రయాలు మందగించడంతో పన్నుల రూపంలో రావాల్సిన మొత్తానికి గండి పడింది. దీంతో బడ్జెట్‌ సైతం ఆ మేరకు తగ్గిపోవడంతో సీఎం కేసీఆర్‌ అలా ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, రాష్ట్ర రాబడి తగ్గడానికి కారణమైన అంశాల్లో వాహన పన్ను కూడా ఉంది. వాహనాల విక్రయం వల్ల వచ్చే పన్నుకు సంబంధించి కేవలం ఐదు నెలలకే ఏకంగా రూ.420 కోట్ల మేర తగ్గిపోయింది. 

ఇక మిగిలిన ఆర్థిక సంవత్సరంలో కూడా ఇందులో పెద్దగా మెరుగుదల ఉండే అవకాశం లేదన్న అంచనాల నేపథ్యంలో ఆ మొత్తం రూ.వేయి కోట్లకు చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల వాహనాల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడమే కాకుండా.. సిద్ధంగా ఉన్న వాహనాలు అమ్ముడు కాకపోవడంతో ఆ రంగం బాగా నష్టపోయిందని సీఎం కేసీఆర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో కూడా ప్రస్తావించారు. ఫలితంగా ప్రభుత్వానికి వాహనాల విక్రయ రూపంలో రావాల్సిన పన్నుల్లో కోత పడటంతోపాటు పెట్రోలు, డీజిల్, టైర్లు, ఇతర వాహనాల విడిభాగాల అమ్మకాలు తగ్గి వాటి ద్వారా రావాల్సిన పన్ను కూడా తగ్గిపోయిందని వివరించారు.

తగ్గిన అమ్మకాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు పరిస్థితి గమనిస్తే.. వాహనాల విక్రయానికి సంబంధించి ఒక్క త్రైమాసిక పన్ను తప్ప మిగిలినవన్నీ భారీగా పడిపోయాయి. గతేడాది ఇదే కాలానికి నమోదైన అంకెలతో బేరీజు వేసుకుంటే.. జీవిత పన్ను, అమ్మకపు ఫీజు, సర్వీస్‌ చార్జీ, తనిఖీ ఫీజు(డిటెక్షన్‌)ల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. ఈ ఐదు కేటగిరీల్లో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.1,448 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణంగా ఈ మొత్తం ప్రతి ఏటా 12 శాతం నుంచి 15 శాతం మేర పెరుగుతుంది. కానీ ఈసారి మాత్రం గతేడాది కంటే 2.02 శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది అదే ఐదు నెలల కాలానికి రూ.1,418 కోట్లు మాత్రమే వచ్చింది. వాస్తవానికి ఆ మొత్తం రూ.1,868 కోట్ల మేర ఉంటుందని సర్కారు అంచనా వేసింది. కానీ అనూహ్యంగా తగ్గిపోవడంతో ఆ మేరకు బడ్జెట్‌ ప్రభావితమైంది.

ద్విచక్రవాహనాలపైనే ఎక్కువ ప్రభావం....
కార్లతో పోలిస్తే ద్విచక్ర వాహనాల రూపంలో పడ్డ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఐదు నెలల కాలానికి సంబంధించి గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడుకాగా, ఈ ఏడాది అదే కాలంలో 2.88 లక్షలకు తగ్గిపోయింది. దీంతో ఆ మేరకు ఆదాయానికి కూడా గండి పడింది. వీటిద్వారా జీవితపన్ను రూపేణా గతేడాది ఐదు నెలల కాలానికి రూ.313 కోట్లు వసూలు కాగా, ఈసారి కేవలం రూ.174 కోట్లకే పరిమితమైంది. కార్ల విషయంలో మాత్రం పెద్దగా మార్పు చోటుచేసుకోలేదు.

మరిన్ని వార్తలు