రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి!

18 Nov, 2023 03:53 IST|Sakshi

4 శాతం ముస్లిం రిజర్వేషన్‌ ఎత్తివేత 

ఐదేళ్లలో మహిళలకి 10 లక్షల ఉద్యోగాల కల్పన 

వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం 

బీజేపీ మేనిఫెస్టోలో హామీల దశదిశ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌) అమలు చేస్తామనే హామీని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచనున్నట్టు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. రోహింగ్యాలు, అక్రమ వలస దారులను వెనక్కి పంపడం, అన్ని పంటలకూ బీమా, ప్రీమియం సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేత, ఐదేళ్లలో మహిళలకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన, వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించనున్నట్టు తెలిసింది.

రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దీనిని విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్‌ ఏర్పాటు, తెలంగాణలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌ ఎత్తివేత, 5 ఏళ్లకు రూ.లక్ష కోట్లతో బీసీ అభివృద్ధి నిధి ఏర్పాటు, ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 ఏళ్లు వచ్చే సరికి రూ. 2 లక్షలు ఇచ్చే ఏర్పాటు, మహిళా రైతు కార్పొరేషన్‌ ఏర్పాటు, ఫీజుల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలను దశ(పది) దిశ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఇందులో మరికొన్ని ఇలా...
ధరణి స్థానం లో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, గల్ఫ్‌ బాధితుల కోసం నోడల్‌ ఏజెన్సీ, 

 సబ్సిడీ పై విత్తనాలు, వరి పై బోనస్, ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి రూ.2 లక్షల ఇచ్చే ఏర్పాటు, ఉజ్వల గ్యాస్‌ లబ్దిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్‌ లు అందజేత, బడ్జెట్‌ స్కూల్స్‌ కు పన్ను మినహాయింపులు, ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ల ఏర్పాటు, పీఆర్‌సీపై సమీక్ష, అయిదేళ్లకోసారి పీఆర్‌సీ ఏర్పాటు, జీఓ 317 పై పునః సమీక్ష, గల్ఫ్‌ దేశాల్లో తెలంగాణ భవన్‌ల ఏర్పాటు, 

 అన్ని పంటలకు బీమా.  

మరిన్ని వార్తలు