సర్కారీ చదువు మారదేమీ?

13 Feb, 2018 03:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తెలుగు కూడా చదవలేకపోతున్న విద్యార్థులు

లెక్కలంటే దిక్కులే.. ఇంగ్లిష్‌ సరేసరి

‘3 ఆర్స్‌’ లక్ష్యాలను సాధించలేని టీచర్లు

విద్యాశాఖ సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తీసివేత, గుణకారం, భాగహారం లెక్కలడిగితే దిక్కులు చూసే పిల్లలే ఎక్కువ! తెలుగులో ఓ పేరాను చక్కగా చదివి అర్థం చేసుకునేవారూ తక్కువే. ఇక ఇంగ్లిష్‌ సంగతి సరేసరి! సర్కారీ బడుల్లో విద్యార్థుల పరిస్థితి ఇదీ. పిల్లలకు కనీస సామర్థ్యాలైన చదవడం.. రాయడం.. లెక్కలు చేయడం (3ఆర్స్‌) కూడా రావడం లేదు. వీటిని ప్రతి విద్యార్థికి నేర్పించేందుకు ఆగస్టులో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా లక్ష్యం నెరవేరలేదు. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు ‘3 ఆర్స్‌’ నేర్పించేందుకు ప్రతి రోజు మూడు పీరియడ్ల చొప్పున 60 రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాటి ఫలితాలు తెలుసుకునేందుకు గతనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ బృందాలు రాష్ట్రంలోని 1,226 పాఠశాలలను పరిశీలించాయి. ఈ అధ్యయనంలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కూడా కొరవడుతున్నట్టు తేలింది.

తెలుగులో ఒక పేరాను చదివి అర్థం చేసుకోగలిగేవారు, సొంతంగా రాయగలిగిన వారు ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 5–10 శాతమే ఉన్నారు. ఉన్నత పాఠశాలల్లో అలాంటి వారు కేవలం 15–20 శాతమే ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు మీడియంలో ప్రాథమిక పాఠశాలల్లో గుణింతాల వరకు నేర్పించినా.. ఉన్నత పాఠశాలల్లో ఒత్తుల పదాల వద్దే కార్యక్రమం ఆగిపోయింది. ప్రాథమిక స్థాయి పిల్లలు ఇంగ్లిషు పదాలను చదవలేకపోతున్నారు. విద్యార్థులకు కనీస సామర్థ్యాలను నేర్పించే బోధన సరిగ్గా లేదని పరిశీలన బృందాలు తేల్చాయి. కార్యక్రమ నిబంధనల ప్రకారం.. గణితంలో గుణకారం, భాగాహారం చేసేలా విద్యార్థులకు నేర్పించాలి. కానీ అది చేయలేకపోయారు. గణితంలో ప్రాథమిక స్థాయిలో ఎక్కువ పాఠశాలల్లో తీసివేతల వరకు, కొన్ని పాఠశాలలు గుణకారం వరకే నేర్పించాయి. ఉన్నత పాఠశాలల్లో గుణకారాల వరకే నేర్పించారు. భాగాహారాలు చేయగలిగిన విద్యార్థులు 20 శాతానికి మించి లేరు.

పరిశీలనలో వెల్లడైన మరిన్ని అంశాలు..
పిల్లలకు యాంత్రికంగా అభ్యాసం చేయించారు
పదాలను బోర్డులపై రాసి వల్లె వేయించడం, డిక్టేషన్‌ చెప్పడం వరకే పరిమితమయ్యారు
పుస్తకాలు, వార్తా పత్రికలు, బాలసాహిత్యం, కథా వాచకాలు, అక్షరాలు, పదాలు, సంఖ్యలకు సంబంధించిన బోధన సామగ్రిని ఎక్కడా ఉపయోగించ లేదు
కార్యక్రమం జరిగే రోజుల్లో ఎంఈవోలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలలను సందర్శించినా.. పిల్లల పురోగతిని పరిశీలించలేదు
ఉన్నత పాఠశాలల్లో పర్యవేక్షణే లేదు

టీచర్ల హాజరు ఇలా..
ప్రాథమిక పాఠశాలల్లో...
పాఠశాలల పరిశీలన సమయంలో టీచర్ల హాజరు గద్వాలలో 65 శాతం ఉంటే కామారెడ్డిలో 67 శాతం ఉంది
అత్యధికంగా టీచర్ల హాజరు సిరిసిల్ల్ల (98 శాతం), సంగారెడ్డి, మెదక్‌ (95 శాతం), ఆసిఫాబాద్‌ (94 శాతం)ఖమ్మం (93 శాతం) జిల్లాల్లో నమోదైంది. ఆదిలాబాద్‌లో 70 శాతం, మంచిర్యాల, కరీంనగర్‌లో 74, నిర్మల్‌లో 75 శాతంగా ఉంది.

ఉన్నత పాఠశాలల్లో ఇలా..
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ 95 శాతం, వరంగల్‌ అర్బన్‌ 94 శాతం, జగిత్యాల 93 శాతం, వనపర్తి 91 శాతంతో అగ్రస్థానంలో నిలిచాయి. రంగారెడ్డి జిల్లా 62 శాతం, ఆదిలాబాద్‌ 70, యాదాద్రిలో 74, కరీంనగర్, ఖమ్మంలో 78 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి.

విద్యార్థుల హాజరు అంతంతే...
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సగటు హాజరు 80 శాతం ఉంటే ఉన్నత పాఠశాలల్లో 79 శాతం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ హాజరు శాతం హైదరాబాద్, రంగారెడ్డి, జనగాం, వికారాబాద్‌ల్లో నమోదైంది. అత్యధికంగా సిద్దిపేటలో 94 శాతం, కామారెడ్డిలో 92 శాతం, మెదక్‌లో 90 శాతం, జగిత్యాలలో 86 శాతం నమోదైంది.
ఉన్నత పాఠశాల్లో తక్కువ హాజరు నమోదైన జిల్లాలు: వికారాబాద్‌ 52 శాతం, రంగారెడిŠడ్‌ 59 శాతం, గద్వాల 67 శాతం, జనగామ 73 శాతం, మెదక్‌ , మంచిర్యాల 75 శాతం.
 అత్యధికంగా హాజరు నమోదైనవి: సంగారెడ్డి 92 శాతం, మేడ్చల్, నిర్మల్‌ 87 శాతం, సిరిసిల్ల 86 శాతం, సిద్దిపేట, జగిత్యాల, సూర్యాపేట 85 శాతం.

మరిన్ని వార్తలు