కన్నకొడుకులే కాదుపొమ్మన్రు..

26 Sep, 2017 12:36 IST|Sakshi
ఆదుకోవాలని కలెక్టర్‌నువేడుకుంటున్న వడ్డెపల్లి చంద్రయ్య ,ఆగునూరి నర్సమ్మ

ప్రజావాణిలో ఇద్దరు వృద్ధుల గోడు

ఆదుకోవాలని కలెక్టర్‌కు వేడుకోలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌ : కని పెంచిన తల్లిదండ్రులను జీవిత మలిసంధ్యలో ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన కొడుకులు వారిని భారంగా భావించి వదిలించుకున్నారు. బుక్కెడు బువ్వకు ఆశపడ్డ వృద్ధులను నిర్ధాక్షిణ్యంగా ఇంటినుంచి బయటకు పంపించారు. దిక్కుతోచని   స్థితిలో ఆ వృద్ధులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇద్దరు వృద్ధులు కలెక్టర్‌ కర్ణన్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. హాజీపూర్‌ మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన వడ్డెపెల్లి చంద్రయ్య ఇల్లు ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయింది. పరిహారం కింద పైసా కూడా రాలేదు. ఉండటానికి ఇల్లు లేదు. ఒక్కగానొక్క కొడుకు దగ్గర బతుకుదామని వెళ్తే కాదు పొమ్మని వెళ్లగొడుతున్నాడు. తనకు బతికే దారిచూపాలని కోరుతూ కలెక్టర్‌ను ఆశ్రయించాడు. కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి చంద్రయ్యకు కొడుకు నుంచి జీవనభృతి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటి పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, వెంటనే పరిహారం అందేలా చూడాలని ఆర్డీవోకు సూచించారు.  

నర్సమ్మది మరో ఆవేదన
బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆగునూరి నర్సమ్మ భర్త సింగరేణి కంపెనీలో ఉద్యోగం చేసి మరణించాడు. భర్త ఉద్యోగం కొడుకు ధర్మరాజ్‌కు పెట్టించింది. కుమారునికి, కూతురికి వివాహం జరిపించింది. గతంలో బాగానే చూసిన కొడుకు కొంతకాలం క్రితం తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దిక్కులేని ఆమె శ్రీసాయి అనాథ శరణాలయంలో చేరింది. కొన్ని రోజుల కిందట ధర్మరాజ్‌ శరణాలయానికి వచ్చి మా ఆమ్మను బాగా చూసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత మరల తిట్టుకుంటూ ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో నర్సమ్మ ఎవ్వరి ఇళ్లకు వెళ్లలేక, తిరిగి అనాథ శరణాలయం వెళ్లాలంటే మనసొప్పక ఒంటరిగా కాలం వెళ్లదీస్తోఓంది. కుమారుడు తన పోషణ బాధ్యత చేపట్టేలా చూడాలని, లేకుంటే నెలకు రూ.5వేల జీవనభృతి ఇప్పించాలని వేడుకుంది. అలాగే వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేస్తే తనకు ఆసరాగా ఉంటుందని కలెక్టర్‌కు విన్నవించుకుంది.

మరిన్ని వార్తలు