విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు

30 Jun, 2015 03:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు విద్యుత్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెరిగాయి. కనీస మూలవేతనంపై 12 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను గత మే 1 నుంచి చెల్లించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కార్మికులు గత ఏప్రిల్ 27 నుంచి మే 13 వరకు సమ్మె నిర్వహిం చారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ విద్యుత్ సంస్థలు.. కార్మిక జేఏసీతో గత నెల 13న ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో కార్మికులు సమ్మె వీడి విధుల్లోకి చేరారు. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ప్రకారం విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందే కార్మికులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేశారు. కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న సొమ్మునే బీమా ప్రీమియం గా చెల్లించాలని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు ఉండదని హామీ ఇచ్చారు. ఇకపై కార్మికులను కాంట్రాక్టర్లు నేరుగా తొలగించకుండా నిబంధనలు తెచ్చారు.  

సంబంధిత అధికారి రాతపూర్వకంగా ఆ ప్రక్రియను జరపాల్సి ఉంటుంది. కార్మికుల పనుల ను కాంట్రాక్టర్లే పర్యవేక్షిస్తారు. కార్మికచట్టాల మేర కు కార్మికుల రికార్డులను సైతం కాంట్రాక్టర్లు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జీవో 3 ప్రకారం వేతనాలు చెల్లిస్తుండగా, జీవో 11 ఆధారంగా చెల్లించే విషయాన్ని పరిశీలిస్తామనే హామీ ప్రస్తావన ఉత్తర్వుల్లో లేదు. 12 శాతం ప్రత్యేక అలవెన్స్‌తో ఒనగూరే ప్రయోజనమేమీ లేదని కార్మిక నేతలు నాగరాజు, సాయిలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు