ఉద్యోగుల కార్పొరేట్ వైద్యంపై పీటముడి | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కార్పొరేట్ వైద్యంపై పీటముడి

Published Tue, Jun 30 2015 3:39 AM

ఉద్యోగుల కార్పొరేట్ వైద్యంపై పీటముడి - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల కార్పొరేట్ వైద్యంపై పీటముడి వీడడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అమలుకాకపోవడం... సమస్య పరిష్కారానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పలుమార్లు చర్చలు జరి పినా కొలిక్కిరాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నగదు రహిత ఆరోగ్య కార్డులు ఇచ్చినప్పటికీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు లెక్కచేయడం లేదని వారంటున్నారు.

ఆసుపత్రులను ఒప్పించడంలో సర్కారు విఫలమైందన్న భావన ఏర్పడింది. ఉద్యోగులకు  ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు ఉచి తంగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిం చగా... సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజ మాన్యాలు ససేమిరా అంటున్నాయి. ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని తేల్చిచెబుతున్నాయి. దీనిపైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజాగా సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీషా) ప్రతినిధులతో మరోమారు సమావేశం నిర్వహించారు.

ఆ భేటీలోనూ ఎటువంటి ముఖ్యనిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. వచ్చే నెల 3న టీషా ప్రతినిధులతో నేరుగా సీఎస్ చర్చలు జరుపుతారు. సీఎం ఆదేశాల మేరకే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

అప్పటికీ చిన్నచిన్న సమస్యలు పరిష్కారం కాకుంటే నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతారని అంటున్నారు. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు సంబంధించి ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం దీనిపై పెద్దగా శ్రద్ధ చూపించడంలేదన్న విమర్శలున్నాయి.
 
రెండింటినీ కొనసాగిస్తే...?
కార్పొరేట్ ఆసుపత్రుల గగ్గోలు, ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో వైద్యాధికారులు అయోమయంలో పడిపోయారు. సీఎస్ సమావేశం నాటికి ఈ సమస్య ఒక కొలిక్కి రాకపోతే నగదు రహిత కార్డులు, రీయిం బర్స్‌మెంట్ ఈ రెండు పద్దతులనూ కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఉన్నతాధికారుల్లో నెలకొంది. ఏదేమైనా త్వరగా ఈ సమస్యను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని సంఘాలు కోరుతున్నాయి.

Advertisement
Advertisement