ఉద్యోగుల విభజన అప్పీళ్లపై విచారణ 6కు వాయిదా

30 Jun, 2015 22:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన అప్పీళ్లపై విచారణను హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జూలై 6కు వాయిదా పడింది. ఈ అప్పీళ్ల విచారణార్హతపైనే వాదనలు వినిపించాలని హైకోర్టు ఈ సందర్భంగా జెన్‌కో, పంపిణీ సంస్థల తరఫు న్యాయవాదులకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీ ట్రాన్స్‌కో, జెన్‌కో, పంపిణీ సంస్థలు దాఖలు చేసిన ఈ అప్పీళ్ల విచారణార్హతపై ఉద్యోగుల తరఫు సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, వేదుల వెంకటరమణ, డాక్టర్ లక్ష్మీనర్సింహలు అభ్యంతరం తెలిపారు. సింగిల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల్లో టీ ట్రాన్స్‌కో తదితరులు కౌంటర్లు దాఖలు చేయలేదని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కౌంటర్లు దాఖలు చేయకుండా అప్పీళ్లు దాఖలు చేయడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు. రిలీవ్ చేసిన ఉద్యోగులకు కేవలం పది రోజులకు మాత్రమే జీతాలు చెల్లించారని వేదుల వెంకటరమణ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం, తదుపరి విచారణ సమయంలో ఈ అప్పీళ్ల విచారణార్హతపై వాదనలు వినిపించాలని టీ ట్రాన్స్‌కో, ఇతర పంపిణీ సంస్థల అప్పీళ్ల తరఫు సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్‌రెడ్డి, జి.విద్యాసాగర్, ఎస్.నిరంజన్‌రెడ్డిలకు స్పష్టం చేస్తూ విచారణను జూలై 6కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు