ఉద్యోగ ఖాళీలు.. 1,07,744

25 Nov, 2014 01:56 IST|Sakshi

పాఠశాల విద్యాశాఖలో 24,861, ఉన్నత విద్యలో 10,592
అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతానికి 1,07,744 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉద్యోగుల తుది కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, తాత్కాలికంగా 5,23,675 పోస్టులను తెలంగాణకు కేటాయించారని వివరించారు. ఇందులో 1,07,744 ఖాళీలు ఉన్నాయని సోమవారం శాసనసభలో తెలిపారు.

పాఠశాల విద్యాశాఖలో 24,861, ఉన్నత విద్యాశాఖలో 10,592, హోం శాఖలో 15,339, రెవెన్యూ శాఖలో 10,142 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగుల తుది కేటాయింపు సమయంలో వారు ఎంపిక చేసుకునే రాష్ట్రాన్ని బట్టి ఈ సంఖ్య మారవచ్చని పేర్కొన్నారు. సభ్యులు డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, భాస్కర్‌రావు, రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

మార్కెట్‌లో సద్దిమూట: హరీశ్‌రావు
నిజామాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డులో ‘సద్దిమూట’ కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. దీన్ని ప్రభుత్వపరంగా కాకుండా, ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని చెప్పారు.

పేదలకు 1,158 ఎకరాలు పంపిణీ: సీఎం
భూమిలేని పేద దళితులు, గిరిజనులకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. నవంబర్ 22 నాటికి 447 మంది లబ్ధిదారులకు 1158.29 ఎకరాల భూమి పంపిణీ చేసినట్లు వివరించారు. ఇందుకు రూ.42.87 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు