ఖాళీ పోస్టులు 10,236

26 Nov, 2014 02:23 IST|Sakshi

హన్మకొండ అర్బన్ : త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తామని... రాష్ట్రంలోని సుమారు 1.07లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి శాసన సభలో ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఉత్సాహంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి సడలిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేయడంతో నిరాశలో ఉన్న వారిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. చివరిసారిగా తమ అదృష్టం పరీక్షించుకునే అవకాశం వచ్చిందని వారు ఆనంద పడుతున్నారు.

ఉద్యోగ నియామకాల ప్రక్రియకు నిర్ధిష్టమైన తేదీ ప్రకటించకున్నా... కొద్ది నెలల్లో అనడంతో పోటీలో ఉండాలనుకుంటున్న వారందరూ పుస్తకాలతో కుస్తీ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు నుంచి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,236 ఖాళీలు ఉన్నాయని అధికారికవర్గాల సమాచారం. వీటిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాల్సినవే ఎక్కువగా ఉన్నాయి. టీచర్ పోస్టుల వంటి కొన్ని మాత్రం డీఎస్పీ ద్వారా భర్తీ చేస్తారు. కొద్ది సంవత్సరాలుగా ఊరిస్తున్న సర్వీస్ కమిషన్ నియామకాల్లో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక పదుల సంఖ్యలోనే ఏపీపీఎస్పీ నుంచి నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మిగతా ఖాళీలను భర్తీ ప్రక్రియ  త్వరగా చేపట్టాలని నిరుద్యోగులు ఆకాంక్షిస్తున్నారు.

విభజన లెక్కలు పూర్తయితేనే...
విభజన లెక్కలు పూర్తయితేనే రాష్ట్రంతోపాటు జిల్లాల వారీగా కూడా పూర్తి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇదే విషయూన్ని ముఖ్యంమంత్రి కూడా శాసన సభలో తెలిపారు. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజనతతోపాటు జోనల్, మల్టీ జోనల్ కేడర్ అధికారుల పంపకాలు పూర్తి చేసినట్లయితే ఇక్కడ ఉండేవారు... ఆంధ్రాకు వెళ్లేవారి లెక్కలు పక్కాగా తేలుతాయి. వాటి ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు గుర్తించే ప్రక్రియ సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎటొచ్చి ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు ఉండవని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

శిక్షణ సంస్థల్లో పెరిగిన రద్దీ
రాష్ట్ర విభజన... సాధారణ ఎన్నికల్లో ‘మేం అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అంటూ అన్ని పార్టీలు ప్రకిటించాయి. ఈ విషయంలో అందరికన్నా ముందున్న టీఆర్‌ఎస్ పగ్గాలు చేపట్టడంతో సహజంగానే ఉద్యోగ నియామకాలపై యువతీయవకులు ఎంతో ఆశగా ఉన్నారు. ఎన్నికల అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, నియామకాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ప్రస్తుతం వేలాది మందితో కిక్కిరిసి పోతున్నాయి. త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటై... సిలబస్ ప్రకటిస్తే ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు