‘సాగునీటి’ పటిష్టానికి మేధోమథనం

22 Dec, 2019 03:24 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఈఎన్‌సీ మురళీధర్‌. చిత్రంలో ఇతర ఈఎన్‌సీలు

ఇరిగేషన్‌శాఖ పటిష్టంపై వర్క్‌షాప్‌లో చర్చించిన ఇంజనీర్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటిశాఖ పునర్‌వ్యవస్థీకరణపై మేధోమథనం జరిపేందుకు ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో శనివారం నిర్వహించిన ఒక్కరోజు వర్క్‌షాప్‌ విజయవంతమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆ శాఖ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం)పాలసీ తయారు చేయడం, సాగునీటి శాఖ పునర్‌వ్యవస్థీకరణ, శాఖ ఆస్తులు, ఇతర సాంకేతిక అంశాల జాబితా రూపకల్పన, శాఖ కార్యకలాపాలను ప్రభావితం చేసే చట్టాలు, ఇతర శాఖలతో సమన్వయం వంటి అంశాలపై సదస్సులో కూలంకషంగా చర్చించారు. కార్యాచరణపై ఇంజనీర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాగునీటి శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో ఈఎన్‌సీ స్థాయి నుంచి ఈఈ స్థాయి వరకు 250 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. సదస్సు లక్ష్యాలను, ప్రభుత్వ ఆలోచనను పరిపాలనా విభాగపు ఈఎన్‌సీ నాగేందర్రావు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టులో 75 లక్షల ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాల కిందే ఉందని, రానున్న రోజుల్లో వీటి నిర్వహణ కీలకం కానుందని తెలిపారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఈఎన్‌సీల మధ్య పని విభజన జరగాలని సీఎం అభిలషించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఎత్తిపోతల పథకాల్లో 80కి పైగా పంప్‌హౌస్‌ల నిర్వహణకు దీర్ఘకాలిక దృష్టితో ఒక సమగ్ర ‘ఓఅండ్‌ఎం’పాలసీని తయారు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి పథకాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పంప్‌హౌస్‌లు, విద్యుత్‌ పరికరాలు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థల నిర్వహణ, షిఫ్ట్‌ ఇంజనీర్ల బాధ్యతలు, సిబ్బంది అవసరాలు తదితర అంశాలపై వివరించారు.

పదోన్నతుల సంగతి సీఎం దృష్టికి తీసుకెళ్లాలి
ఈ సందర్భంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి తాము కష్టించి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని సదస్సులో పాల్గొన్న ఇంజనీర్లు తెలిపారు. అయితే గత రెండేళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన పదోన్నతులకు హైకోర్టు తీర్పుతో అన్ని అడ్డంకులు తొలగిపోయినందున వెంటనే పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. దీని తర్వాత జనవరిలో మరో సదస్సును కూడా నిర్వహిస్తామని, అవసరమైతే సీఎం స్థాయిలో మరో విస్తృత స్థాయి సదస్సును నిర్వహిస్తామని ఈఎన్‌సీ మురళీధర్‌ అన్నారు. సదస్సులో ఈఎన్‌సీలు హరిరాం, నల్లా వెంకటేశ్వర్లు, అనిల్‌ కుమార్, చీఫ్‌ ఇంజనీర్లు, శ్రీనివాస్‌ రెడ్డి, మధుసూదనరావు, బంగారయ్య, వీరయ్య, శంకర్, హమీద్‌ ఖాన్, నరసింహా, అనంత రెడ్డి, శ్రీదేవి, శ్రీనివాస రావు, అజయ్‌ కుమార్, మోహన్‌ కుమార్, శంకర్‌ నాయక్, వి.రమేశ్, వి.సుధాకర్, డీసీఈలు అజ్మల్‌ఖాన్, నరహరిబాబులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు