తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ ప్రమాణస్వీకారం

3 Jun, 2014 00:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్‌సేన్ గుప్తా ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లోని దర్బారు హాలులో సోమవారం ఉద యం 6.32 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ ప్రమాణం చేశారు. కేసీఆర్ కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమం పూర్తయ్యే సమయంలో  చేరుకున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, సీపీఐ నేత నారాయణ, బీజేపీ తెలంగా ణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జరిగిన తేనీటి విందులో గవర్నర్ సతీసమేతంగా అందరినీ పలకరించారు.
 
 మీకు ఇద్దరు భార్యలు: గవర్నర్‌తో నారాయణ
 ‘మీకు ఇద్దరు భార్యలన్న మాట.. జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందేమో..’ అని గవర్నర్ నరసింహన్‌తో సీపీఐ నేత నారాయణ సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఒహ్ గాడ్.. పక్కనే మా శ్రీమతి ఉంది. నిజమే అనుకుంటే నాకు కష్టం..’ అని నరసింహన్ బదులిచ్చారు. పక్కనే ఉన్న గవర్నర్ భార్య విమల జోక్యం చేసుకుని ‘నేను ఇక్కడ ఉండగానే ఆయనతో మరొకరు ఉన్నారని అంటారా?’ అని నవ్వుతూనే ప్రశ్నించారు. ‘ఇప్పుడే కదా మేడమ్ మీ ఆయన, మీ సమక్షంలోనే రెండో పెళ్లి చేసుకున్నారు (ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉంటూనే తెలంగాణకు ప్రమాణ స్వీకారం చేశారనే అర్థంలో) కదా..’ అని నారాయణ బదులివ్వడంతో అక్కడే ఉన్న కిషన్‌రెడ్డి, చక్రపాణి, అధికారులంతా చిరునవ్వులు చిందించారు. ‘ఇప్పటిదాకా ఉద్యమాలు, రాజకీయాల్లో ఎన్నో జరిగాయి. ఇక నుండి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలసి పనిచేయండి’ అని కిషన్‌రెడ్డిని గవర్నర్ కోరగా.. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు