జక్రాన్‌పల్లిలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు

11 Aug, 2018 14:35 IST|Sakshi
రికార్డులపై అధికారితో మాట్లాడుతున్న జేసీ రవీందర్‌ రెడ్డి 

జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జక్రాన్‌పల్లిలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని నిజామాబాద్‌ జేసీ రవీందర్‌ రెడ్డి అన్నారు. ఆయన శనివారం శుక్రవారం జక్రాన్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. ఎయిర్‌ పోర్టు ఏర్పాటు కోసం అవసరమైన భూమిని సిద్ధంగా ఉంచామన్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు.  

‘ధరణి’ ద్వారా పాస్‌బుక్‌లందించాలి 

వివిధ కారణాలతో నిలిచిన పట్టాదారు పాస్‌బుక్‌లు ధరణి వెబ్‌సైట్‌ ద్వారా తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకంతో త్వరగా పూర్తి చేసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని జేసీ సూచించారు. జిల్లాలో ఐదు విడుతలుగా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందించామన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా పాస్‌బుక్‌లు నిలిచిపోయాయన్నారు.

వాటిని వెంటనే పరిశీలించి రైతులకు పాస్‌బుక్‌లు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులు వారం రోజుల్లో జిల్లా కార్యాలయానికి పంపించాలన్నారు. కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు.

ముఖ్యంగా కల్యాణ లక్ష్మి దరఖాస్తులకు గెజిటెడ్‌ సంతకం కోసం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పారు. గెజిటెడ్‌ సంతకం లేకుండానే విచారణ చేసి దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలలో దొర్లిన తప్పొప్పులను సరి చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, ఆర్‌ఐ అరుణ ఉన్నారు.  

మరిన్ని వార్తలు